హైదరాబాద్: తనను వివాహం చేసుకోకుంటే చంపివేస్తానని బెదిరించిన యువకుడు, అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…జూబ్లీహిల్స్‌కు చెందిన వ్యాపారవేత్త కిషోర్ రెడ్డి కూతురు జ్ఞాపికా రెడ్డికి చిత్తూరుకు చెందిన వ్యాపారి కుమారుడు వైష్ణవ్‌తో వివాహం చేసేందుకు నిర్ణయించారు. కట్నంగా వరుడికి రూ.3కోట్లు, ఇతర లాంఛనాలు ఇచ్చేందుకు వధువు కుటుంబం అంగీకరించింది. గత ఏడాది ఇరు కుటుంబాలు మాట్లాడుకుని వివాహం చేసేందుకు అంగీకరించారు. దీనిలో భాగంగా ఫిబ్రవరి 10, 2023వ తేదీన వివాహాం చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు. వివాహా వేడుకలో భాగంగా ఫిబ్రవరి 7వతేదీన మొయినాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో సంగీత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
సంగీత్‌లో పెళ్లి కుమారుడు వైష్ణవ్, అతడి స్నేహితులు మధ్యం తాగారు. అక్కడికి వచ్చిన పెళ్లికుమార్తె తమ్ముడిపై అందరూ కలిసి దాడి చేశారు, వారిని ఆపేందుకు వెళ్లిన పెళ్లికుమార్తె జ్ఞాపికా రెడ్డిపై వైష్ణవ్ దాడి చేశాడు. దీంతో వధువు కుటుంబ సభ్యులు వివాహాన్ని రద్దు చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత వధువు కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లకు తమకు లక్షలాది రూపాయలు ఖర్చయ్యాయని వాటిని చెల్లించాలని పెళ్లికుమారుడి కుంటుంబానికి చెప్పారు. చెల్లిస్తామని చెప్పిన వారు రెండు నెలల నుంచి వాయిదా వేయడమే కాకుండా బెదిరింపులకు దిగారు. పెళ్లికూతురు జ్ఞాపికా రెడ్డికి పెళ్లికుమారుడు వైష్ణవ్ ఫోన్ చేసి తనను కాకుండా వేరే వారిని వివాహం చేసుకుంటే చంపివేస్తానని బెదిరిస్తున్నాడు.
అతడికి కుటుంబ సభ్యులుతోడై వారు కూడా బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితుడితోపాటు కుటుంబ సభ్యులు రవిబాబు, దేవి,తేజు, శ్రణ్‌తో పాటు స్నేహితులపై ఐపిసి 354,324,420,406,506సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.