భూతలంపై 70 శాతం జలావరణమే. జల వనరుల్లో దాదాపు 97 శాతం సాగర జలమే. సముద్రాలు సకల జీవరాసులకు నెలవు. భూగ్రహం మీద వెలసిన మహాద్భుతం మహాసముద్ర సృష్టి మాత్రమే. జీవ వైవిధ్యాలకు ఆదరువు, పర్యావరణ పరిరక్షణకు హితవరిగా సముద్రాలు విశ్వ మానవాళికి ఎనలేని సేవలను అందిస్తున్నది. సముద్రుడిని దైవంగా పూజించడం, తన సంతానంగా లక్ష్మి, చందమామలను భావించడం మన సంప్రదాయంలో ఉన్నది. సముద్రాలు సకల జీవరాశుల ఉనికికి, మనుగడకు ప్రత్యక్ష, పరోక్ష సంబంధాన్ని కలిగి ఉన్నాయి.
సముద్రాల పరిశుద్ధ జల ఆరోగ్యాన్ని కాపాడుకోవలసిన కనీస బాధ్యత మనందరి మీద ఉన్నది. అనాదిగా సముద్రాలు వ్యాపార విస్తరణలు, ప్రయాణాలు, వస్తు రవాణలు, వర్ష దాతలు, సముద్ర జీవ సంపదలకు నెలవులుగా వినియోగించబడుతున్నాయి. సముద్ర జలాల ప్రాధాన్యతను అవగాహన చేసుకునేందుకు ప్రతి ఏటా ‘భారత జాతీయ సముద్ర దినం (నేషనల్ మారిటైమ్ డే ఆఫ్ ఇండియా)’ పాటించుట 1964 నుంచి జరుగుతున్నది.
కాలుష్య కేంద్రాలుగా సముద్ర జలాలు
ఆధునిక మానవుడి అనాలోచిత, స్వార్థపూరిత కార్యాలతో సముద్రాలు కాలుష్య కేంద్రాలుగా మారుతూ, సముద్ర జీవులను, మానవ జాతి ఉనికిని అతి ప్రమాదకర స్థితిలోకి నెట్టుతున్నాయి. సాగర కాలుష్యాల్లో రసాయన, కాంతి, శబ్ద, ప్లాస్టిక్ కాలుష్య రకాలు ఉన్నాయి. సముద్ర కాలుష్యానికి కారణంగా ప్లాస్టిక్, చెత్తా చెదారం, మురికినీరు, సముద్ర తవ్వకాలు, చమురు లీకేజీలు, వ్యవసాయ రంగంలోని పురుగు మందుల వ్యర్థాలు, విషతుల్య రసాయనాలు, గాలి కాలుష్య ఫలిత ఆమ్లత్వం, సముద్ర రవాణ వ్యవస్థలు లాంటివి అతి ముఖ్యమైనవి.
సముద్ర కాలుష్యంతో జలాల్లో ఆక్సీజన్ గాఢత తగ్గడం, సముద్ర జీవులు ప్రభావితం కావడం, పగడపు దిబ్బలు విచ్ఛిన్నం కావడం, మానవ ఆరోగ్య దెబ్బతినడం, ఆహార చక్రం కలుషితం కావడం, సముద్ర జీవుల పునరుత్పత్తి విఫలం కావడం లాంటి అవాంఛనీయ ప్రమాదకర మార్పులు ఏర్పడుతాయి.
ప్లాస్టిక్ కాలుష్య సాగర జలాలు
సాగర కాలుష్యానికి ప్రధాన కారణంగా ప్రమాదకర ప్లాస్టిక్ అని గుర్తించబడింది. మానవులు వాడి వదిలేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు నేల కాలుష్యానికే కాకుండా సముద్ర జలాలకు చేరి సముద్ర జల కాలుష్యానికి కారణం అవుతున్నది. జీవ విచ్ఛిన్నం కావడానికి వందల సంవత్సరాలు తీసుకునే ప్లాస్టిక్స్ వల్ల సముద్ర జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా 18 బిలియన్ పౌండ్ల ప్లాస్టిక్ వ్యర్థాలు సాగర జలాలను కలుషితం చేస్తున్నాయి. ముఖ్యమైన ప్లాస్టిక్ వ్యర్థాల్లో సింగిల్- యూజ్ ప్లాస్టిక్స్, సిగరెట్ బట్స్, ఆహార పొట్లాలు, ప్లాస్టిక్ బ్రెవరేజ్ బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్ మూతలు, స్ట్రాలు, ప్లాస్టిక్ బ్యాగులు, స్టిరర్స్ లాంటివి వస్తాయి. సముద్ర జలాల్లో 25 ట్రిలియన్ల ప్లాస్టిక్ పదార్థ వ్యర్థ ముక్కలు ఉన్నాయని, వీటిలో 2.69 లక్షల టన్నులు సముద్ర నీటిపై తేలుతున్నాయని,
చదరపు కిమీకు 4 బిలియన్ మైక్రో-ఫైబర్ ప్లాస్టిక్స్ సాగర గర్భానికి చేరుతున్నాయని అంచనా వేశారు. సముద్రానికి చేరిన 80 శాతం ప్లాస్టిక్స్ నేల- ఆధార మూలాలైన పరిశ్రమల వ్యర్థాలు, వ్యర్థాల నియంత్రణ సక్రమంగా లేకపోవడం, వ్యక్తులు వదిలిన వ్యర్థాలు, మురికినీరు లాంటివి గుర్తించబడినవి. సముద్ర కాలుష్యంతో ప్రతి యేటా ఒక మిలియన్ సాగర పక్షులు చనిపోతున్నాయి. సముద్ర గర్భంలో ప్లాస్టిక్ బ్యాగులు, లోహ డబ్బాలు, చేపలు పట్టే పరికరాలు, గాజు బాటిళ్లు, బూట్లు, టైర్లు లాంటి అనేక వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. కొన్ని సముద్ర ప్రాంతాల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరి, ఆ జలాల్లో ప్రాణ వాయువు గాఢత పడిపోవడంతో జీవ మనుగడ సాధ్యపడడం లేదు. ఇలాంటి సముద్ర జలాలున్న ప్రాంతాలను ‘డెడ్ జోన్స్’ అంటున్నాం. నేడు ప్రపంచ వ్యాప్తంగా 500లకు పైగా డెడ్ జోన్లు ఉన్నాయని అంచనా.
ప్రమాదం అంచున జలచరాలు
ప్లాస్టిక్ కాలుష్యంతో ప్రతి ఏటా ఒక లక్ష సముద్ర జంతువులు చనిపోతున్నాయి. గాలి కాలుష్యంతో వెలువడిన కార్బన్ వ్యర్థాలు సముద్ర జలాల ఆమ్ల స్వభావాన్ని 150 శాతం పెంచుతున్నాయి. దాదాపు 80 శాతానికి పైగా మురికి నీటిని శుద్ధి చేయకుండానే సముద్రాల్లోకి వదిలి వేయడం జరుగుతోంది. చమురు లీకేజీ వల్ల 12 శాతం, నగరాలు / పరిశ్రమల వల్ల 36 శాతం చమురు సముద్ర జలాల్లో కలుస్తున్నది. పడవలు, ట్లాంకర్లు లాంటి రవాణ యంత్రాల వల్ల సముద్రం శబ్ద కాలుష్యానికి లోనై చేపలు, ఇతర జంతువులకు హానిని కలుగజేస్తుంది.
ఇలాగే ప్లాస్టిక్ కాలుష్యం పెరిగితే 2050 నాటికి సముద్రాల్లో చేపల కన్నా ప్లాస్టిక్ కలుష్య వ్యర్థాలు అధికం అవుతాయని అంచనా. సముద్ర జంతువులు ఆహారానికి, ప్లాస్టిక్‌కు తేడా గుర్తించనందున, ప్లాస్టిక్‌ను ఆహారంగా భ్రమపడి తినడం జరుగుతుంది. జీర్ణ కావడానికి అవకాశం లేని ప్లాస్టిక్‌తో జంతువులు చనిపోవడం జరుగుతుంది. చైనా, ఇండోనేషియా దేశాలు అధికంగా 33 శాతం ప్లాస్టిక్ కాలుష్యానికి కారణం అవుతున్నాయి. సముద్ర జలాల్లో ప్లాస్టిక్ విచ్ఛిన్నం కావడానికి 400 ఏండ్ల సమయం పడుతుంది.
సముద్ర కాలుష్య కట్టడి
సముద్ర కాలుష్యాన్ని అరికట్టే మార్గాలుగా చెత్త నియంత్రణ, ప్లాస్టిక్ వాడకాన్ని తగించడం (రెడ్యూజ్), తిరిగి వాడుకోవడం (రీయూజ్), ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేయడం తప్పక జరగాలి. ప్రమాదకర ప్లాస్టిక్‌ను నిషేధించడం, అతి ప్యాకేజీలను తగ్గించడం, షాపింగ్‌కు వెళ్లే సందర్భాల్లో స్వంత బ్యాగులను వెంట తీసుకెళ్లడం, పేపర్ బ్యాగులను వినియోగించడం, ప్లాస్టిక్ కాలుష్యం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం, పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేసి వదలడం, మురికి నీటిని సముద్రాలు నదుల్లో కలువకుండా చూడడం లేదా శుద్ధి చేసిన తరువాతనే వదలడం,
గాలి కాలుష్యాన్ని కట్టడి చేయడం, చమురు లీకేజీలను అరికట్టడం, రేడియోధార్మిక వ్యర్థాలు సముద్ర జలాలను చేరకుండా చూడడం, షిప్/ ట్యాంకర్ల కదలికలను తగ్గించడం, వేస్ట్/రేయిన్ వాటర్ మేనేజ్‌మెంట్‌ను అభివృద్ధి చేయడం, ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ గ్రీన్ ఉత్పత్తులను రూపొందించడం లాంటి చర్యలను తీసుకోవాలి. ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణలో రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రికవర్ మంత్రాలను సదా పాటిద్దాం. సముద్రాలను పరిశుద్ధ దేవాలయాలుగా పూజిద్దాం. మన ఆరోగ్య భవితకు మనమే పునాదులు వేసుకుందాం.