మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర రిజర్వ్ పోలీసు దళం (సిఆర్‌పిఎఫ్)లో 1.3 లక్షల కానిస్టేబుళ్ల నియామకం కోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసినప్పటినుంచి అనేక రాష్ట్రాల అభ్యర్థుల్లో నిరసన జ్వాలలు నివురుగప్పిన నిప్పులా రాజుకుంటున్నాయి. ఈ నియామకాల కోసం జరిపే కంప్యూటర్ ఆధారిత రాతపరీక్షను ఇంగ్లీషు, హిందీ భాషల్లోనే రా యాల్సి ఉంటుందని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొనడ మే ఈ నిరసన జ్వాలలకు కారణం సాంస్కృతిక, భాషా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరా టం జరిపే బంగ్లా పొఖ్ఖోలాంటి సంస్థలు, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణితో పాటుగా పలువురు రాజకీయ విశ్లేషకులు, విద్యావేత్తలు ఈ నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తున్నారు. కే వలం ఇంగ్లీషు, హిందీలోనే రిక్రూట్‌మెంట్ పరీక్ష రాయాలని కేంద్రం పేర్కొనడం తమ మాతృభాష లో పరీక్ష రాయాలనుకొంటున్న లక్షలాది మంది మంది యువకులకు అవకాశాలు లేకుండా చేయడమేనని వారు అంటున్నారు.
గుర్తించబడిన అన్ని భాషల్లోను ఈ పరీక్ష రాసేలా కేంద్రంపై ఒత్తిడి తే వాలని బంగ్లా పొఖ్ఖో ప్రధాన కార్యదర్శి గర్గా చ టర్జీ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కర్నాటక మాజీ సిఎం సిద్ధరామయ్య తదితరులకు లేఖలు రాశారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది యువకులు తమ మాతృభాష అయిన తెలుగులోనే పరీక్ష రాయడానికి ప్రాధాన్యత ఇస్తారని ప్రొఫెసర్ చక్రపాణి అంటూ ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావు, ఎపి సిఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావులకు విజ్ఞప్తి చేశారు. వీరి డిమాండ్‌కు చాలా మంది మద్దతు ఇస్తున్నారు కూడా. ఇంగ్లీషు, హిందీ భాషల్లో మాత్రమే పరీక్ష రాయాలని కేంద్రం పేర్కొనడం ఈ రెండు భాషల్లో కాకుండా ఇతర మీడియంలలో చదువుకొన్న లక్షలాది మంది యువకులకు అవకాశం లేకుండా చేయడమే కాకుండా , యావత్తు దేశంపై హిందీని బలవంతంగా రుద్దడమేనని వారు అంటున్నారు. సిఆర్‌పిఎఫ్‌లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 10 శాతం పోస్టులను అగ్నివీర్‌లకు రిజర్వ్ చేశారు. మెట్రిక్యులేషన్, తత్సమాన విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకోసం దేహదారుఢ్య పరీక్ష(ఫిజికల్ టెస్టు)తో పాటుగా రాతపరీక్ష, మెడికల్ టెస్టు కూడా ఉంటుంది.