హైదరాబాద్‌ః తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. శనివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ రైలును ప్రధాని మోడీ ప్రారంభించిన అనంతరం పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభా వేదిక నుంచి అభివృద్ధి పనులను ప్రారంభించి ప్రసంగించారు. ”భాగ్యలక్ష్మీ నగరాన్ని వెంకటేశ్వర స్వామి నగరంతో కలిపాం. రాష్ట్రంలో రూ.11వేల కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించాం. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ రైలు ప్రారంభించాం. హైదరాబాద్ ఒకేరోజు 13 ఎంఎంటిఎస్ రైళ్లను ప్రారంభించాం. దేశ అభివృద్ధిలో తెలంగాణ భాగమయ్యేలా చూశాం.ఈ ఏడాది మౌలిక వసతుల కోసం రూ.10 లక్షల కోట్లు కేటాయించాం.
హైదరాబాద్-బెంగళూరు అనుసందానాన్ని మెరుగుపరుస్తున్నాం. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తీర్ణాన్ని భారీగా పెంచుతున్నాం. రూ.35వేల కోట్లతో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం. భారీ టెక్స్ టైల్ పార్క్ నిర్మించనున్నాం. టెక్స్ టైల్ పార్క్ తో రైతులు, కార్మికులకు ఎంతో ఉపయోగం. రాష్ట్ర అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం రాలేదు. కేంద్రం అభివృద్ధి పనులు చేపడుతంటే రాష్ట్ర ప్రభుత్వం బాధపడుతోంది. అభివృద్ధి పనుల్లో కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి రావట్లేదు. కుటుంబ పాలన, అవినీతి వేర్వేరు కాదు.కుటుంబ పాలనతో కొంత మంది ప్రగతి నిరోధకులుగా మారారు” అని పేర్కొన్నారు.