ప్రపంచం లోని ప్రధాన ఆరోగ్యసమస్యల్లో ఆస్టియో ఆర్థరైటిస్ ఒకటి. దీన్ని డీజెనరేటివ్ డిసీజ్ (djd) అని కూడా అంటారు. నొప్పితోపాటు వైకల్యం చెంది పనితీరును కోల్పోయే సుదీర్ఘకాలిక అనారోగ్యం. సాధారణంగా వృద్ధుల్లో కనిపించే ఈ అనారోగ్యం ఇప్పుడు యువకుల్లో కూడా కనిపించడం గమనించదగ్గది. అమెరికన్ కాలేజీ ఆఫ్ రుమటాలజీ అధికారిక జర్నల్‌లో వెలువడిన అధ్యయనం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఆస్ట్రియో ఆర్థరైటిస్ కేసులు 1990లో 247.51 మిలియన్ల నుండి 2019 లో 527.81 మిలియన్లకు 113.25 శాతం పెరిగాయి.
ఆస్టియో ఆర్థరైటిస్ లో ఎముకల చివరలను కప్పి ఉంచే రక్షిత కణజాలం అయిన మృదులాస్తి విఛ్ఛిన్నమవుతుంది. అందువల్లనే కీలు లోని ఎముకలు కలిసి రాపిడి చెందుతాయి. ఏ కీళ్లలోనైనా ఇది సంభవించవచ్చు. కానీ శరీరంలో అత్యంత సాధారణంగా ప్రభావితమైన ప్రాంతాలు వేళ్లు, చేతులు, భుజం, వెన్నెముక, మెడ, వీపు దిగువ, మోకాలు, వంటి చోట ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే మోకాళ్లు తరచుగా ఈ ప్రభావానికి గురవుతుంటాయి. రానురాను ఇవి తీవ్రమై భరించలేని నొప్పిగా మారతాయి.
జన్యువులు, ఎముకల్లో అసాధారణతలు, వృద్ధాప్యం, గాయాలు మొదలైనవి మోకాలి ఆర్థరైటిస్‌కు కొన్ని అనివార్య కారణాలు..మోకాలి ఆర్థరైటిస్‌ను పూర్తిగా నివారించే మార్గం లేనప్పటికీ, వ్యాధి లక్షణాలు తగ్గించడానికి చేయాల్సిన మార్పులు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. శరీరం బరువు ఎక్కువగా ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటివారు 4.55 రెట్లు ఎక్కువగా మోకాలి ఆస్ట్రియో ఆర్థరైటిస్ కలిగి ఉంటారు. వీరు వ్యాయామం చేస్తే, తగిన ఆహారం తీసుకుంటే ఊరట లభిస్తుంది. వ్యాయామం చేయడం వల్ల కీళ్లపై అధిక బరువు తగ్గుతుంది. వాటిని అంటిపెట్టుకుని ఉండే కండరాలు బలోపేతం అవుతాయి. ఫిట్‌నెస్‌కు తగినట్టు అనువైన కార్యకలాపాల్లో పాల్గొనాలి.
ఇంతకు ముందు ఎప్పుడైనా వ్యాయామం చేయకపోతే ఇప్పుడు నెమ్మదిగానైనా ప్రారంభించండి. క్రీడలు ఆడుతున్నప్పుడు, లేదా ప్రమాదానికి గురైనప్పుడు కీళ్లు దెబ్బతింటాయి. మృదులాస్థి దెబ్బతింటుంది. భారీ బరువులు ఎత్తడం, మెట్లు ఎక్కడం, వంటి పనులు మోకాలి కీళ్లపై విపరీత ప్రభావం చూపుతాయి. ధూమపానం చేయవద్దు. ధూమపానం మానేస్తే కీళ్ల నొప్పులు తగ్గడమే కాక, గుండె, ఊపిరితిత్తుల వ్యాధుల నుంచి ముక్తి కలుగుతుంది.
ఆర్థరైటిస్‌కు డయాబెటిస్‌కు దగ్గర సంబంధం ఉంది. అలాంటివారిలో డయాబెటిస్ ఉండే అవకాశం 61 శాతం ఎక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల శరీరం నిరంతరం ఇన్‌ఫ్లెమేషన్ కలిగి ఉంటుంది. కీళ్లలో రియాక్టివ్ ఆక్సిజన్ అభివృద్ధి చెందుతుంది. ఇది ఇన్‌ఫ్లెమేటరీ ప్రొటీన్లయిన సైటోకిన్స్ ఉత్పత్తిని పెంచుతుంది. ఆర్థరైటిస్ తీవ్ర తరం కాకుండా కాపాడుకోవాలంటే జాగింగ్, టెన్నిస్ వంటి ఎక్కువ ప్రభావం చూపే క్రీడలను ఆడరాదు. దానికి బదులుగా స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి తక్కువ ప్రభావ కార్యకలాపాలు చేయవచ్చు.
వారానికి 150 నిమిషాలు వ్యాయామం చేయాలి. కీళ్ల నొప్పులున్న చోట హాట్‌ప్యాక్ లేదా ఐస్‌ప్యాక్ అమలు చేయాలి. ఫిజికల్ థెరపీ వ్యాయామాలు చేయాలి. మోకాలి ఆర్థరైటిస్ ఉన్నవారికి మందులు పనిచేయవు. ఫిజియోథెరపీ కూడా పనిచేయదు. కీళ్ల మార్పిడి (జాయింట్ రీప్లేస్‌మెంట్ ) ఆపరేషన్లు చేయించుకుంటేనే కోలుకోగలుగుతారు. ఫాస్ట్‌ట్రాక్ రీప్లేస్‌మెంట్ సర్జరీలైతే ఆపరేషన్ జరిగిన వెంటనే నడిచే వీలు కలుగుతుంది.