ఇండోర్: బిజెపి సీనియర్ నేత కైలాస్ విజయ్ వర్గీయ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆడవాళ్ల దుస్తులపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సరైన దుస్తులు ధరించనిఆడవాళ్లను రామాయణంలో శూర్పణఖతో పోల్చారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాత్రిపూట బయట తిరుగుతున్న సమయంలో మత్తులో ఉన్న యువతను చూస్తుంటానని, ఆ సమయంలో వాళ్ల చెంప పగులగొట్టాలన్నంత కోపం వస్తుంటుందని ఆయన అన్నారు. ఇక సరైన దుస్తులు వేసుకోని అమ్మాయిలను కూడా ఆయన తప్పుబట్టారు. మహిళలను దేవతలుగా పూజిస్తుంటారని, అయితే సరైన దుస్తులు వేసుకోని అమ్మాయిల్లో ఆ ఆనవాళ్లు ఉండవన్నారు.
వాళ్లు శూర్పణఖలాగా కనిపిస్తారని అన్నారు. దేవుడు మీకు మంచి శరీరాన్ని ఇచ్చారని, మంచి దుస్తులు వేసుకోవాలని సలహా ఇచ్చారు. అయితే బిజెపి నేత కైలాస్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నేతలు,నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ‘ బిజెపి నేతలు పదేపదే మహిళలను అవమానిస్తున్నారు. అది వారి ఆలోచనా ధోరణిని, ప్రవర్తనను చెబుతుంది. విజయ్ వర్గీయ మహళలను శూర్పణఖతో పోల్చడమే కాకుండా వాళ్ల దుస్తులపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు’ అని కాంగ్రెస్ ప్రతినిధి సంగీత శర్మ అంటూ దీనికి బిజెపి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.