Monday, December 23, 2024

మహిళా నేతలకూ తప్పని వేధింపులు

- Advertisement -
- Advertisement -

స్థానిక సంస్థలలో మహిళలకు ప్రాతినిధ్యం పెద్ద సంఖ్యలో ప్రారంభమైన రెండున్నర దశాబ్దాలు అవుతున్నా ఇంకా సర్పంచులు, మున్సిపల్ చైర్ పర్సన్‌ల స్థానంలో వారి భర్తలు ఎందుకు పెత్తనం చేస్తున్నారు? పురుషులు కీలక పదవులలో ఉన్నప్పుడు తమ భార్యలను లేదా కుటుంబంలోని మహిళలను తమ అధికార పదవుల జోలికి రానీయడం లేదు. కానీ మహిళలు అటువంటి పదవులలోకి వస్తే వారిని స్వేచ్ఛగా పనిచేసేందుకు ముందుగా కుటుంబ సభ్యుల నుండే ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర మంత్రి వర్గాలు, రాజకీయ పార్టీలలో నిర్ణయాలు తీసుకొనే కేంద్రాలలో మహిళల పాత్ర నామమాత్రంగా ఉంటున్నది. బిజెపి తమ కార్యవర్గాలలో మూడో వంతు మహిళలు ఉండాలని నిర్ణయించుకున్నా రాష్ట్ర అధ్యక్షులు, శాసనపక్ష నేతలు, ఇతర కీలక పదవులలో ఎంత మంది మహిళలు ఉన్నారంటే సమాధానం చెప్పలేరు.

1947లో దేశానికి స్వాతంత్య్రం రాక ముందు నుంచే భారత జాతీయ ఉద్యమంలోనూ ఇప్పడూ మహిళలు వివక్షకు గురువుతున్నారు. తమ హక్కులు, సాధికారికత కోసం గొంతెత్తే మహిళలు హేళనకు గురవడం తరచూ జరుగుతూ వస్తోంది. ఇందిరా గాంధీ, జయలలిత వంటి బలమైన మహిళా నేతలూ స్వతంత్ర భారత దేశంలో ఆవిర్భవించినా వారి మంత్రి వర్గాలలో లేదా వారి నేతృత్వంలోని రాజకీయ పార్టీలలో సహితం మహిళలు అలంకారప్రాయంగా మిగిలిపోయారు. భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం విలువలతో ప్రేరణ పొందిన మహిళలు చరిత్రాత్మకంగా అనేక హక్కుల తిరస్కరణకు గురవుతున్నారు. రాజ్యాంగంలో ఓటు హక్కు, ఎన్నికలలో పోటీ, ఆస్తి హక్కు, వివక్షకు వ్యతిరేకంగా మగవారితో సమానంగా హక్కులను పొందినా ఆచరణలో ఇంకా మనం మహిళా సాధికారికత గురించి మాట్లాడవలసి వస్తుంది.

వలస రాజ్యాల కాలంలో ప్రారంభమైన ప్రక్రియలో స్వతంత్ర భారత దేశం బలమైన మహిళా హక్కుల ఉద్యమాన్ని చూసింది. మహిళలు స్వయం ప్రతిపత్తి కోసం, గృహ హింస, వరకట్నానికి వ్యతిరేకంగా పోరాడారు. లైంగిక వేధింపుల కేసుల్లో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఫలితంగా ప్రగతిశీల చట్టాలు అనేకం వచ్చినా వాటి అమలు మొక్కుబడిగా కొనసాగుతుంది. మత, కుల సరిహద్దులు దాటి ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతీ, యువకులపై తరచూ దాడులు, హత్యలు కూడా జరుగుతున్నాయి. విద్యలో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నా వారి శ్రామిక శక్తి భాగస్వామ్య రేట్లు పెరగడం లేదు. ప్రపంచంలోని అధికారిక శ్రామిక శక్తిలో మహిళల అత్యల్ప వాటాలో భారతదేశం ఉంది. మహిళల రాజకీయ ప్రాతినిధ్యం సహితం మొక్కుబడిగా సాగుతుంది. ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో రెండోసారి ఒక మహిళా, మొదటిసారి ఒక ఆదివాసీ వ్యక్తి ఈ అత్యున్నత పదవికి ఎన్నికైనందుకు సంతోషిస్తున్నప్పటికీ రాజకీయ రంగంలో మహిళలు నిర్ణయాలు తీసుకొనే స్థానం పొందలేకపోతున్నారు.

1992 -93 నుండి స్థానిక సంస్థలలో మహిళా ప్రాతినిధ్యం పెరుగుతూ వస్తుండడంతో లక్షలాది మంది స్థానిక సంస్థలకు ఎన్నికవుతున్నా పార్లమెంట్, అసెంబ్లీలకు రాలేకపోతున్నారు. చట్టసభల లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలనే బిల్లును మూలన పడవేయడంలో దాదాపు అన్ని రాజకీయ పక్షాలు క్రియాశీల పాత్ర పోషించాయి. ఆ బిల్లు గురించి ప్రశ్నించడమే నేరంగా నేడు దేశంలో బలమైన నాయకులు భావిస్తున్నారు. భారత ఎన్నికల సంఘం సమాచారం ప్రకారం 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన సుమారు 8000 మంది అభ్యర్థులలో 723 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. ఈ సంఖ్య ఇప్పటికే ఆశ్చర్యకరంగా, తక్కువగా ఉన్నప్పటికీ ఇది ఒక విధంగా ఇటీవల కాలంలో అత్యధికం కావడం గమనార్హం. మహిళలు నేడు లోక్‌సభ సభ్యులలో కేవలం 14.9% మాత్రమే ఉన్నారు. అయితే, స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదటిసారిగా అత్యధిక సంఖ్యలో పార్లమెంట్‌కు 2019 ఎన్నికలలోనే ఎన్నికయ్యారు. అంటే, రాజకీయాలలో మహిళల సాధికారికతకు ఎంత దూరం లో ఉన్నామో స్పష్టం అవుతుంది.

మరోవంక ఓటు హక్కు వినియోగించుకోవడంలో మహిళలు పురుషుల కన్నా చాలా ముందుండటం గమనార్హం. 2019లో 65% మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ మాత్రమే తమ అభ్యర్థులలో సగం మందిని మహిళలనే ఎంపిక చేసింది. మరే ఇతర రాజకీయ పార్టీ కూడా మహిళలు తగు ప్రాతినిధ్యం ఇవ్వడం లేదు. రాజ్యసభలో అయితే ప్రస్తుతం 12.3 శాతం మంది సభ్యులు మాత్రమే మహిళలు ఉన్నారు. ఇక రాష్ట్రాల అసెంబ్లీలలో వారి వాటా 0 నుండి 15 శాతం వరకు ఉంటుంది. స్థానిక సంస్థలలో దాదాపు సగం స్థానాలు మహిళలకు రిజర్వు చేసి ఉండడంతో భారత దేశం ప్రపంచంలోనే అత్యధికంగా ఎన్నికైన మహిళలు గల దేశంగా ఖ్యాతి పొందుతున్నది. అయినప్పటికీ స్థానిక స్థాయికి మించి జాతీయ స్థాయి వరకు భారత రాజకీయాలు పురుషుల కేంద్రంగా కొనసాగుతున్నాయి. అవకాశం వచ్చినప్పుడు సామర్థ్యంలో, విషయం పరిజ్ఞానంలో పురుషులకు ఏమాత్రం తీసిపోమని అనేక మంది మహిళలు పలు కీలక పదవులలో నిరూపించుకున్నారు. అయినప్పటికీ వారికి తగు ప్రాతినిధ్యం ఇచ్చేందుకు పురుష అహంకారం ఆధిపత్యంతో నిండిన రాజకీయ పార్టీలు సుముఖంగా లేవు.

స్థానిక సంస్థలలో మహిళలకు ప్రాతినిధ్యం పెద్ద సంఖ్యలో ప్రారంభమైన రెండున్నర దశాబ్దాలు అవుతున్నా ఇంకా సర్పంచులు, మున్సిపల్ చైర్ పర్సన్‌ల స్థానంలో వారి భర్తలు ఎందుకు పెత్తనం చేస్తున్నారు? పురుషులు కీలక పదవులలో ఉన్నప్పుడు తమ భార్యలను లేదా కుటుంబంలోని మహిళలను తమ అధికార పదవుల జోలికి రానీయడం లేదు. కానీ మహిళలు అటువంటి పదవులలోకి వస్తే వారిని స్వేచ్ఛగా పనిచేసేందుకు ముందుగా కుటుంబ సభ్యుల నుండే ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర మంత్రి వర్గాలు, రాజకీయ పార్టీలలో నిర్ణయాలు తీసుకొనే కేంద్రాలలో మహిళల పాత్ర నామమాత్రంగా ఉంటున్నది. బిజెపి తమ కార్యవర్గాలలో మూడో వంతు మహిళలు ఉండాలని నిర్ణయించుకున్నా రాష్ట్ర అధ్యక్షులు, శాసనపక్ష నేతలు, ఇతర కీలక పదవులలో ఎంత మంది మహిళలు ఉన్నారంటే సమాధానం చెప్పలేరు.

మంత్రి పదవులలో ఉన్న మహిళలు సహితం మంత్రివర్గ సమావేశాలలో స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. తాను ఇతర మంత్రిత్వ శాఖల అంశాలలో అభిప్రాయం చెప్పబోతే ‘నీ శాఖ సంగతి చూసుకోవమ్మా’ అంటూ అడ్డుకొనేవారని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కేబినెట్ మంత్రిగా పనిచేసిన ఓ మహిళా నేత ఒక సందర్భంలో చెప్పారు. నేడు రాజకీయాలలో మహిళలు ఎదుర్కొంటున్న మరో ముఖ్యమైన సమస్య సోషల్ మీడియాలో అసభ్యమైన అపవాదులను ఎదుర్కోవలసి రావడం. లింగ సంబంధమైన నిరాధార ఆరోపణలకు తరచూ గురవుతున్నారు. ముఖ్యంగా గత దశాబ్ద కాలంగా ఈ వికృత ధోరణి పెరుగుతున్నది.

డిజిటల్ ఇండియాగా భారత దేశం ఎంతగా సగర్వంగా అత్యాధునిక సమాచార యుగంలోకి వెడుతుందో అంతగా మహిళా నేతల గౌరవానికి భంగం కలుగుతుందని చెప్పవచ్చు. మంత్రులు, ఎంపిలు వంటి కీలక పదవులలో ఉన్న మహిళకు సహితం తప్పడం లేదు. ఇక రాజకీయ నాయకులు మహిళల పట్ల అనుచితంగా మాట్లాడటం కూడా సర్వసాధారణంగా మారుతున్నది. ఆ విధమైన అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నాయకులు లేదా వారి పార్టీలు కనీసం సిగ్గుపడటం లేదు. మహిళలకు ఇటువంటి వేధింపులు రాజకీయ పార్టీల నుండే ఎదురవుతూ ఉండటం బాధాకరం. నేడు ప్రతి రాజకీయ పార్టీ కూడా సోషల్ మీడియా విభాగాలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నది. ఆన్‌లైన్ ప్రచారం కోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసుకొంటున్నది. ఈ బృందాలు తమ పార్టీ విధానాలు, కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడం కాకుండా ప్రత్యర్థి రాజకీయ పక్షాలలోని మహిళా నేతలను లక్ష్యంగా చేసుకొని అసభ్యకరమైన సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో ఆరితేరుతున్నారు.

బహుశా భారత దేశంలో సోషల్ మీడియాను కేవలం ప్రజల అత్యవసర సమస్యల పరిష్కారం కోసం అత్యంత ప్రతిభావంతంగా ఉపయోగించుకున్న ఏకైక నాయకురాలు దిగవంత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్. ఆమె ఒక హిందూ యువతీ, ముస్లిం యువకుడిని వివాహం చేసుకోవడంలో ఎదురైన సమస్య గురిం చి తెలుసుకొనే వెంటనే సహాయం అందించారు. దానితో ఆమెపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు వచ్చాయి.

నేడు దేశంలో ఏకైక మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీని 2021 అసెంబ్లీ ఎన్నికలలో ప్రత్యర్ధులు ‘మహిళలకు ఉండవలసిన లక్ష్యాలు ఏమీ లేని నేత’ అంటూ ‘తన కాళ్ళను జనానికి చూపించాలి అనుకుంటే బెర్ముడా షారట్స్ వేసుకోవలసింది’ అంటూ అసభ్యంగా పోస్టు పెట్టారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి 2019లో మొదటిసారిగా ట్విట్టర్‌లోకి వస్తే ‘వివాహం కానీ శృంగార తార’ అంటూ కామెంట్స్ పెట్టారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉత్తరప్రదేశ్‌లో పార్టీ ప్రచారం చేపట్టిన ప్రియాంక గాంధీపై ‘అందం తప్ప మరెటువంటి ప్రతిభ లేని నేత’ అంటూ వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా విశేషమైన ప్రాబల్యం గల మహిళా నేతలే ఈ విధమైన లైంగిక వేధింపులకు గురవుతుంటే, ఇక సాధారణ మహిళలు రాజకీయాల పట్ల ఆసక్తి చూపగలరా? మహిళలు రాజకీయాలలో కొనసాగాలంటే లైంగికంగా వేధించే ఇటువంటి వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో కొనసాగవలసిందేనా? ఈ విషయమై ఏ రాజకీయ పార్టీ కూడా కనీసం తమ పార్టీకి చెందిన మహిళా నేతలకు రక్షణ కల్పించేందుకు ఆసక్తి కనబరుస్తున్న సూచనలు కనిపించడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News