Friday, December 20, 2024

కరోనా నిబంధనలు.. పాటించకపోతే తిప్పలు తప్పవు

- Advertisement -
- Advertisement -

పెరుగుతున్న కరోనా కేసులు.. పలు రాష్ట్రాల్లో అమల్లోకి నిబంధనలు

న్యూఢిల్లీ : గతకొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కొవిడ్ 19 కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా వ్యాప్తిని అడ్డుకోడానికి మళ్లీ కొవిడ్ నిబంధనల్ని అమల్లోకి తీసుకొస్తున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ గడిచిన వారంలో రాష్ట్రప్రభుత్వ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. మహమ్మారి నివారణ, వైద్య వసతుల సన్నద్ధతపై ఆరా తీశారు.

సోమ, మంగళవారాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల సన్నద్ధతను పరిశీలించడానికి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మాక్‌డ్రిల్ నిర్వహించాలని కోరారు. తాజాగా పెరుగుతున్న కేసుల నివారణను సమర్ధంగా అరికట్టేందకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. ఐసీయూ పడకలు, ఆక్సిజన్ సరఫరా సహా ఇతర అత్యవసర ఆరోగ్య సంరక్షణ ఏర్పాట్లను సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. అలాగే వీటిపై ప్రతివారం సమీక్ష నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. కొవిడ్ నాలుగో దశపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మాండవీయ ఓ జాతీయ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ అన్నారు.

ఒమిక్రాన్ వేరియంట్‌లో వచ్చిన బీఎఫ్.7 ఉత్పరివర్తనమే ఇప్పటివరకు చివరిదని తెలిపారు. తాజాగా ఎక్స్‌బీబీ1.16 సబ్ వేరియంట్ ద్వారా కేసులు వ్యాపిస్తున్నాయని, అయితే సబ్ వేరియంట్లు అంత ప్రమాదకరమైనవి కావని తెలిపారు. రోజువారీ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రాథమిక స్థాయి కొవిడ్ నిబంధనల్ని అమల్లోకి తీసుకొచ్చాయి.

హర్యానా
జనసమూహాల్లో ఉన్నప్పుడు కచ్చితంగా మాస్కులు ధరించాలని హర్యానా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు స్వచ్ఛందంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రభుత్వ మార్గదర్శకాలు అమలయ్యేలా జిల్లా, పంచాయతీ యంత్రాంగాలు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

కేరళ
గర్భిణులు, వయసులో పెద్దవారు, జీవనశైలి అనారోగ్యసమస్యలతో బాధపడుతున్నవారు మాస్కులు ధరించడాన్ని కేరళ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈమేరకు ఇటీవలే రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్‌జ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 60 ఏళ్లు పైబడినవారు, డయాబెటిస్ వంటి జీవనశైలి సమస్యలతో బాధపడుతున్న వారిలోనే కొవిడ్ మరణాలు అధికంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతన్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే తగినంత ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని కోరారు.

ఉత్తరప్రదేశ్
విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపనై విమానాశ్రయాల్లో క్షుణ్ణంగా తనిఖీలు జరపాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. కొవిడ్ పాజిటివ్‌గా తేలిన ప్రతిశాంపిల్‌ను జీనోమ్ సీక్వేన్సింగ్‌కు పంపాలని సూచించింది. ఇదే తరహాలో ఢిల్లీ, పుదుచ్చేరి లోనూ జనసమూహాల్లో మాస్కులు ధరించడాన్ని ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి. ఆరోగ్యవ్యవస్థల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాయి.

కొత్తగా 5357 కేసులు
దేశంలో ఆదివారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో 5357కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 32, 814 కి పెరిగింది. కొత్తగా మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 5,30,965 కి చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News