మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పగలు శగలు చిమ్ముతున్నాయి. ఎండల పేరు చెబితేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. దీనికి తోడు రానున్న మూడు నుంచి 5రోజులు ఎండలు మరింత తీవ్రరూపం దాల్చనున్నాయి. పగలు అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3నుంచి 5డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య భారతదేశం ,పశ్చిమ హిమాలయ ప్రాంతాలో మాత్రం సాధారణ ఉష్ణోగ్రతలే ఉంటాయని ఐఎండి వెల్లడించింది.కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఉండకపోవచ్చిని తెలిపింది. దక్షిణాది ప్రాంతాలైన తమిళనాడు , పుదుచ్చేరి ,కరైకల్ లో ఉరుములు మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి ఒకమోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తెలంగాణలో 4డిగ్రీలు పెరిగే అవకాశం
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉష్ణోగ్రతలు 2నుండి 4డిగ్రీల వరకూ పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తూర్పు నుంచి వీచే గాలులతో ఏర్పడిన ద్రోణి ఆదివారం కేరళ నుంచి కర్ణాటక , మరఠ్వాడ మీదుగా విదర్భ వరకూ సగటు సముద్ర మట్టానికి 0.9కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుందని తెలిపింది. ఆదివారం రాష్ట్రంలో అత్యధికంగా భద్రాచలం జిల్లాలో 39డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మంలో 38.2, అదిలాబాద్‌లో 37.8, హన్మకొండలో 37, హైదరాబాద్‌లో 35.7, మహబూబ్‌నగర్‌లో 38.5, మెదక్‌లో 37.6, నల్గగొండలో 38.5, నిజామాబాద్‌లో 38.6, రామగుండంలో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రానున్న 2 రోజులు వడగాడ్పులు వీచే అవకాశాలు ఉన్నట్టు ఏపి విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది.సోమవారం 27మండలాలు, మంగళవారం 32మండలాలలో వడగాడ్పులు వీచే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. అల్లూరి సీతారామరాజు , అనకాపల్లి , తూర్పుగోదావరి , ఏలూరు, కాకినాడ ,పార్వతీపురం మన్యం జిల్లాల పరిధిలోని పలు మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. ఆ తర్వాత రానున్న మూడు రోజులు ఏపిలో పొడివాతావరణం ఉంటుందని తెలిపింది.