న్యూఢిల్లీ : రాష్ట్రస్థాయిలో మైనార్టీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయడానికి మూడు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు చివరి అవకాశం ఇచ్చింది. రాజస్థాన్, తెలంగాణ, జమ్మూ కశ్మీర్‌లు ఈ ప్రక్రియపై స్పందించేందుకు 6 వారాల సమయం ఇస్తున్నామని సోమవారం ధర్మాసనం తెలిపింది. సబంధిత విషయంలో చివరి అవకాశం కల్పించాలని కేంద్రం అభ్యర్థించడంతో దీనికి సుప్రీంకోర్టు సమ్మతించింది. రాష్ట్రాల స్థాయిలో మైనార్టీల గుర్తింపు విషయంపై ఆయా రాష్ట్రాలు ఈ గడువులోగా స్పందించాల్సి ఉంటుంది. కేంద్రం తరఫున ఈ విచారణకు అదనపు సొలిసిటర్ జనరల్ కెఎం నటరాజు హాజరయ్యారు. న్యాయమూర్తులు ఎస్‌కె కౌల్, ఎ అమానుల్లాతో కూడిన ధర్మాసనం ముందు వివరణ ఇచ్చారు.
ఇప్పటికీ తాము దీని విషయంలో తెలంగాణ, రాజస్థాన్ నుంచి వివరణ అందుకోలేదని, జమ్మూ కశ్మీర్ నుంచి పాక్షిక నివేదికకు ఎదురుచూస్తున్నామని కేంద్రం తరఫున తెలిపారు. దేశంలోని పదిరాష్ట్రాలలో హిందువులు మైనార్టీలుగా మారారని, రాష్ట్రాలలో మైనార్టీల గుర్తింపు ప్రక్రియ సమగ్రరీతిలో జరగాల్సి ఉందని న్యాయవాది అశ్విని కుమార్ ఉపాద్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికి మైనార్టీల గుర్తింపు ప్రక్రియపై ఎన్ని సార్లు అడిగినా తమ సమాధానాలు ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు ముందు కేంద్రం తెలియచేసుకుంది.