Tuesday, December 24, 2024

మోడీకి ఉక్కు సవాల్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో పాల్గొనాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న సంచలనాత్మకమైన నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయస్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అనూహ్యంగా తీసుకున్న ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వ పెద్దలను షాక్ కు గురిచేసిందనే చర్చ జరుగుతోంది. “తానొకటి తలిస్తే దైవమొకటి చేసినట్లు”గా విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ వ్యవహారం మారిందనే టెన్షన్ కేంద్ర ప్రభుత్వ పెద్దల్లో మొదలైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై కేంద్ర సర్కార్ పెద్దలు ఎంక్వైరీలు చేస్తున్నారని కొందరు అధికారులు తెలిపారు. అంతేగాక ఈ వ్యవహారంపై రాజకీయ పార్టీల నాయకులే కాకుండా రెం డు తెలుగు రాష్ట్రాల అధికారవర్గాల్లో సైతం హాట్ టాపిక్‌గా మారింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అదానీ గ్రూపునకుగానీ, టాటా స్టీల్‌కు గానీ అప్పగించాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలు గంపెడాశతో ఉన్నారని, అలాంటిది తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీసుకొన్న నిర్ణయంతో ఒక్కసారిగా షాక్ తిన్నారని, ప్రధాని నరేంద్రమోడీ కూడా ఇలాంటి నిర్ణయం వస్తుందని ఊహించలేదని, అందుకే ఈ అం శం జాతీయస్థాయిలో హాట్ టాపిక్‌గా మారిందని ఆ అధికారులు వివరించారు.

అంతేగాక ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకొన్న నిర్ణయంతో తీవ్ర నిరా శ, నిస్పృహలకు లోనైన తెలుగు రాష్ట్రాల బిజెపి నాయకులు అక్కసుతోనే విమర్శలకు దిగుతున్నారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, ఎపి బిజెపి ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డిలు విమర్శలకు పూనుకోవడంతోనే ఆ పార్టీ నేతలు ఎంతటి షాక్‌లో ఉన్నారో అర్థం చేసుకోవాలని కోరుతున్నా రు. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అనే నినాదం తో సాధించుకొన్న ప్రభుత్వరంగ సంస్థ అయిన విశాఖ స్టీల్ కర్మాగారాన్ని తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రజ ల ప్రయోజనాలకే దక్కేటట్లుగా చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీసుకొన్న నిర్ణయంపై ఎపిలోని రాజకీయ పార్టీలు, ప్ర జా సంఘాలు, ఉత్తరాంధ్ర పరిరక్షణ సమితి వంటి మేధావులు కూడా స్వాగతం పలకడమే కాకుండా కెసిఆర్‌ను కీర్తిస్తున్నారు. ఇదే ఇప్పుడు రెండు తెలు గు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అంతేగాక టివి ఛానెళ్ళు, సోషల్ మీడియాలో ఇదే అంశంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలను తిప్పికొట్టేందుకు, ఆయా ప్రభుత్వ రంగ సంస్థలను తిరిగి ప్ర భుత్వం పరిధిలోనే పనిచేసేటట్లుగా చేయాలని భారత్ రాష్ట్రసమితి అధినేత (బిఆర్‌ఎస్), తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కంకణం కట్టుకొన్నట్లుగా ఉందని అంటున్నారు. అంతేగాక బిఆర్‌ఎస్ అధినేత తీసుకొన్న నిర్ణయం యావత్తూ ప్ర భుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను తిప్పికొడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి తెచ్చేందుకు కెసిఆర్ రె‘ఢీ’ అయినట్లుగా ఉందని ఆ అధికారులు విశ్లేషిస్తున్నారు. అంతేగాక దేశ ప్రజలకు ఒ క బలమైన సందేశం ఇచ్చినట్లయ్యిందని, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న ఉద్యో గ, కార్మిక సంఘాలు, దేశంలోని బ్యాంకుల ఉద్యో గ సంఘాలు, ఎల్‌ఐసి వంటి ఇన్సూరెన్స్ కంపెనీల్లోని ఉద్యోగ, కార్మిక సంఘాలకు కూడా ఒక నిర్ధిష్టమైన భరోసా ఇచ్చే విధంగా తెలంగాణ ప్రభు త్వం తీసుకొన్న నిర్ణయం ఉందని అంటున్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థ్ధికంగా దెబ్బతీసి అభివృద్ధి, సంక్షేమ పథకాలు, వ్యవసాయ పథకాలను అమలు కాకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు సృష్టించిన ఇబ్బందులను సమర్థ్ధవంతంగా ఎదుర్కొంటూ దీటుగా నిలబడిన ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో విశాఖ స్టీల్ ప్రభుత్వరంగ సంస్థగానే కొనసాగుతుందనే భరోసాను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కలిగిందని, అంతేగాక ఈ పరిణామం ఎపిలోని అధికారపార్టీకి కాస్తంత ఇబ్బంది కలిగించిందని, అందుకే వైఎస్‌ఆర్‌సిపి నేతలు కూడా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందని వివరించారు. రాను న్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థల మనుగడను కోరుకొంటున్న అధికారులు, ఉద్యోగులు, కార్మికులకు కెసిఆర్ నిర్ణయం ఒక దిక్సూచి మాదిరిగా కనిపిస్తోందని, అందుకే దేశ వ్యాప్తంగా విశాఖ ఉక్కు కర్మాగారానికి జరగబోయే బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనే నిర్ణయంపై ఇంతటి సంచలనాత్మకమైన చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మెజారిటీ వాటా (51శాతం) ఉ న్న సింగరేణి కాలరీస్ సంస్థ ఈవోఐ (విశాఖ ఉక్కు కర్మాగారం) పక్రియలో పాల్గొనేందుకు సంసిద్దతను చేసిందని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర అధికారపార్టీ బిఆర్‌ఎస్ పార్టీ విధానమే ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడటంగా ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక నాయకులు ప్రొఫెసర్ కెఎస్ చలం పేర్కొన్నారు. తిరుపతి వెంకన్న, సిం హాద్రి అప్పన్న, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిల మాదిరిగానే విశాఖ స్టీల్‌ను తెలుగుజాతి నుంచి ఎవ్వరూ విడదీయలేరని ఈ చర్యతో కెసిఆర్ నిరూపించారని ప్రొఫెసర్ కెఎస్ చలం కొనియాడారు. అయితే కేంద్ర ప్రభుత్వంతో తలపడటం అంటే ప్రజా మద్దతు ఉండాలని, అందుకు రాజకీయాలను పక్కనబెట్టి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలంతా “విశాఖ స్టీల్ మాది” అని నినదించాలని పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్రభుత్వరంగంలోనే ఉండేలా కార్మికులతోపాటు ప్రజలు కూడా నినదించాలని ప్రొఫెసర్ చలం కోరారు. అప్పుడే విశాఖ అందాలు అందరివీ అవుతాయని, లేకుంటే బిజెపి పెద్దలు వ్యాపారం చేసి విదేశాల్లో అమ్మేస్తారని ఆయన హెచ్చరించారు. మరోవైపు సిపిఐ, సిపిఎం పార్టీల నాయకులు కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయాన్ని స్వాగతించారు. ఏపి ప్రభుత్వం కనీసం ఇలాంటి ప్రయత్నం కూడా చేయలేదని ఆ పార్టీల నాయకులు ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News