Monday, December 23, 2024

గోమూత్రం వద్దు.. గేదె మూత్రం బెటర్: ఐవిఆర్‌ఐ శాస్త్రవేత్తలు

- Advertisement -
- Advertisement -

బరేలి(యుపి): గోమూత్రం దివ్యౌషధమంటూ దశాబ్దాలుగా జరుగుతున్న ప్రచారం అవాస్తవమని శాస్త్రవేత్తలు తేల్చేశారు. గోమాత్రం సేవిస్తే అందులో ఉండే బ్యాక్టీరియా మనుషులకు హాని చేకూరుస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. దేశంలోనే మొట్టమొదటి పశు పరిశోధనా సంస్థ బరేలిలోని ఇండియన్ వెటెరినరీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఐవిఆర్‌ఐ) జరిపిన పరిశోధనలో వాస్తవానికి గోమూత్రం కన్నా గేదె మూత్రం కొన్ని బ్యాక్టిరియాలపై సమర్థంగా పనిచేస్తుందని తేలింది. ఐసిఎఆర్‌కు చెందిన ప్రొఫెసర్ భోజ్‌రాజ్ సింగ్ నేతృత్వంలో ముగ్గురు పిహెచ్‌డి విద్యార్థుల బృందం ఈ పరిశోధన నిర్వహించింది.

ఆరోగ్యవంతమైన ఆవులు, ఎడ్ల నుంచి సేకరించిన మూత్ర నమూనాలలో 14 రకాల హానికర బ్యాక్టీరియా ఉన్నట్లు ఈ పరిశోధనలో తేలింది. అందులో కడుపులో ఇన్ఫెక్షన్లు దారితీసే ఇషిరిచియా కోలి అనే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఈ పరిశోధనా పత్రాన్ని ఆన్‌లైన్ రిసెర్చ్ వెబ్‌సైట్ రిసెర్చ్‌గేట్‌లో ప్రచురించారు. ఆవులు, గేదెలు, మనుషుల మూత్రాలకు చెందిన 73 శాంపిల్స్‌ను అధ్యయనం చేశామని, ఆవుల కన్నా గేదెల మూత్రం యాంటీ బ్యాక్టీరియల్ శక్తిని కలిగి ఉందని ప్రొఫెసర్ సింగ్ పేర్కొన్నారు.

ఎస్ ఎపిదెర్మిడీస్, ఇ రాపోంటిసి వంటిఇ బ్యాక్టీరియాలపై గేదె మూత్రం సమర్థంగా పనిచేసిందని ఆయన చెప్పారు. స్థానిక డైరీ ఫారాల నుంచి సహివాల్, చర్‌పర్కర్, విందవాణి(క్రాస్ బ్రీడ్) వంటి మూడు జాతులకు చెందిన గోమూత్ర నమూనాలతోపాటు గేదెలు, మనుషుల మూత్ర నమూనాలను సేకరించినట్లు ఆయన తెలిపారు. 2022 జూన్ నుంచి నవంబర్ వరకు తమ అధ్యయనం సాగిందని ఆయన చెప్పారు.

గోమూత్రం తాగడం ఏ కరంగాను మంచిది కాదని, అది మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపగలదని తమ పరిశోధనలో వెల్లడైందని ఆయన వివరించారు. అయితే శుద్ధి చేసిన గోమూత్రంలో హానికరమైన బ్యాక్టీరియా ఉండదన్న వాదన కూడా తమ దృష్టికి వచ్చిందని, దీనిపై పరిశోధన నిర్వహించాల్సి ఉందని ఆయన తెలిపారు. అయితే.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) అనుమతి లేనప్పటికీ భారతీయ మార్కెట్‌లో గోమూత్రం విస్తృతంగా అమ్ముడుకావడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News