న్యూఢిల్లీ: దేశ ప్రగతిని అడ్డుకోవాలని చూస్తున్న జాతి వ్యతిరేక శక్తులన్నీ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై కత్తిగట్టాయని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆప్‌కు జాతీయ హోదా ప్రకటించిన సందర్భంగా మంగళవారం నాడిక్కడ పార్టీ కార్యకర్తలనుద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగిస్తూ కేవలం పదేళ్లలో ఆప్ జాతీయ గుర్తింపును పొందడం అద్భుత, అపూర్వ విజయంగా అభివర్ణించారు. దీంతో తమ మీద ఉన్న బాధ్యత మరింత పెరిగిందని ఆయన తెలిపారు. ప్రపంచంలోనే నంబర్ ఒన్ దేశంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు దేశ ప్రజలంతా ఆప్‌లో చేరాలని ఆయన పిలుపునిచ్చారు.
దేశ ప్రగతిని అడ్డుకోవాలనుకునే జాతి వ్యతిరేక శక్తులన్నీ ఆప్‌పై కత్తికట్టాయని, అయితే దేవుడు మాత్రం తమతో ఉన్నాడని కేజ్రీవాల్ అన్నారు. కరడుగట్టిన నిజాయితీ, దేశభక్తి, మానవత్వం అనే మూడు స్తంభాల ఆధారంగా ఆప్ సిద్ధాంతం రూపొందించదని ఆయన చెప్పారు. ప్రపంచంలోనే నంబర్ ఒన్ దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడమే ఆప్ లక్ష్యమని ఆయన ప్రకటించారు.
ఆప్‌ను ఈ స్థాయికి తీసుకువచ్చిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా.. ప్రస్తుతం జైలులో ఉన్న పార్టీ నాయకులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్లను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అవసరమైతే జైళ్లకు వెళ్లడానికి ఆప్ కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. జైళ్లకు పోవడానికి భయపడేవారు పార్టీని వీడిపోవాలని ఆయన కోరారు.