వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం వెల్లడి
కొవిడ్ 19 బాధితులైన రోగుల రక్తం లోని ప్లాస్మాలో నిర్దిష్టమైన ప్రొటీన్లను గుర్తించడం ద్వారా ఎవరికి శ్వాస అందడం కోసం వెంటిలేటర్ల సాయం అవసరమో , లేదా ఎవరికి వైరస్ వల్ల చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందో తెలుసుకోవచ్చని పరిశోధకులు వెల్లడించారు. అమెరికా లోని వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు.
332 మంది కొవిడ్ రోగుల రక్తం లోని ప్లాస్మా నమూనాలను వీరు అధ్యయనం చేశారు. కొవిడ్ ఇన్‌ఫెక్షన్‌కు గురైన వ్యక్తి నుంచి రక్త నమూనాలను సేకరించి, కీలకమైన ప్రొటీన్ల స్థాయిని పరీక్షించి, కొవిడ్ తీవ్రతను వేగంగా గుర్తించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. మెరుగైన చికిత్స కోసం ఈ సమాచారాన్ని ఉపయోగించుకోవచ్చని వివరించారు. అమెరికా లోని సెయింట్ లూయిస్ లోగల బార్నెస్ జ్యూయిష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్ రోగుల ప్లాస్మా నమూనాలను వీరు అధ్యయనం చేశారు. కొవిడ్ ఇన్‌ఫెక్షన్ లేని 150 మంది ప్లాస్మా నమూనాలతో కొవిడ్ రోగుల నమూనాలను పోల్చి చూశారు.
తీవ్రమైన అస్వస్థతకు గురిచేసే ప్రొటీన్లు ఏవో విశ్లేషించడానికి పరిశోధకులు అదనంగా మరికొన్ని పరీక్షలు చేశారు. తీవ్ర అస్వస్థత కారణంగా ఏ ప్రొటీన్లు క్రమబద్ధీకరణను కోల్పోయాయో తెలుసుకున్నారు. కొవిడ్ రోగుల్లో భారీ సంఖ్యలో ప్రొటీన్లు మారిపోయినట్టు గుర్తించినప్పటికీ, ఇన్‌ఫెక్షన్ సమయంలో ఏ 32 ప్రొటీన్లు క్రమబద్ధీకరణను కోల్పోయినా ఆ రోగులకు వెంటిలేటర్ ద్వారా శ్వాస తీసుకోడానికి సహాయపడవలసిన పరిస్థితి ఏర్పడుతుందని పరిశోధకులు తెలుసుకున్నారు. వైరస్ కారణంగా రక్తం ప్లాస్మాలో మరో ఐదు ప్రొటీన్లు మార్పు చెందినట్టు కనుగొనడం రోగి చనిపోయే ప్రమాదానికి సంకేతంగా గుర్తించారు.
ఈ అధ్యయనం జర్నల్‌సైన్స్‌లో ప్రచురించడమైంది.తాము గుర్తించిన చాలా ప్రొటీన్లు అంతర్గత వాపు లేదా మంటకు సంబంధించినవి కొన్ని కాగా, శరీరం లోని వ్యాధి నిరోధక శక్తికి ప్రతిస్పందించేవి మరికొన్ని అని, అందువల్ల కొవిడ్ ఇన్‌ఫెక్షన్‌కు అవి మారిపోవడాన్ని గమనించడంలో ఆశ్చర్యమేదీ లేదని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. “ కానీ ఈ ప్రొటీన్ల ఉపసమితి కొవిడ్ రోగులకు వెంటిలేషన్ అవసరమని, లేదా మరణించే ప్రమాదం ఉంటుందన్న సంభావ్యతను పెంచింది. ఈ ప్రొటీన్ల వ్యవహారం ఉపయోగించి తామొక పద్ధతిని రూపొందించామని, దీనివల్ల సమస్యలను ముందుగానే నిర్ధారించే వీలు కలుగుతుందని , వైద్య చికిత్సలో ఇది అత్యంత అవసరమని పరిశోధకులు చెప్పారు.