Friday, December 20, 2024

‘అదానీ కబంధ హస్తాల నుంచి’ బైలదిల్లాను విముక్తం చేయాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ వెనుక ముమ్మాటికి కేంద్రం కుట్ర దాగుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు ఆరోపించారు. ఈ స్టీల్ ప్లాంట్‌ను కావాలనే నష్టాల్లోకి నెట్టారని విమర్శించారు. ప్రధాని మోడీ తన మిత్రుడైన అదానీకి లబ్ధిచేకూర్చడం కోస మే ప్రైవేటీకరణ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగంలోని నవరత్నాలను.. మోడీ తన ఇద్దరి ఇష్టరత్నాలకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని కెటిఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టాలను చూపించి.. తన దోస్తులకు చౌకగా విక్రయించడం ప్రధాని మోడీ విధానమన్నారు. తాను చేసిన ఈ విమర్శలు తప్పు అయితే పరువు నష్టం దావా కూడా వేసుకోవచ్చునని కెటిఆర్ వ్యాఖ్యానించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనైనా కాపాడకుంటామన్నారు. దీనిని ఇలాగే వదిలేస్తే రేపు తెలంగాణలోని సంస్థలను కూడా కేంద్రం ప్రైవేటు పరం చేస్తుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా… అదానీకి ఇచ్చిన బైలదిల్లా కాంట్రాక్టును వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా కెటిఆర్ డిమాండ్ చేశారు.

మంగళవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ,ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇందుకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ ప్రోత్సహించాలనే లక్ష్యంతో.. బిహెచ్‌ఇఎల్‌కు నేరుగా అధిక ఆర్డర్లు ఇచ్చిన రాష్ట్రం ఒక్క తెలంగాణే అని అన్నారు. నష్టాలను ప్రజలకు.. లాభాలను నచ్చిన వారికి అప్పగించడం మోడీ ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. సెయిల్ (ఎస్‌ఎఐఎల్) ద్వారా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పరిశీలిస్తామని విభజన చట్టంలో కేంద్రం స్పష్టంగా చెప్పిందని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. బయ్యారం, కడపలో స్టీల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఎన్నోసార్లు కలిశానని, చత్తీస్‌గఢ్‌లోని బైలాదిల నుంచి బయ్యారానికి. అవసరమైన పైప్‌లైన్ ఖర్చుల్లో 50శాతం భరిస్తామని చెప్పామని అన్నారు. 2014 నుంచి బయ్యారం గురించి ప్రశ్నిస్తున్నామని, కేంద్ర మంత్రులను కలిసినా ఎలాంటి లాభం లేదని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

బైలదిల్లా గనులపై కేంద్రం కన్ను

బైలదిల్లా గనులపై కేంద్ర పెద్దల కన్ను పడిందన్నారు. ఆ గనుల్లో మొత్తంగా ఆరు లక్షల కోట్ల రూపాయల విలువైన జాతి సంపద అని అన్నారు. ఇది అదానీ కబంధ హస్తాల నుంచి బయపడితే.. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను బతికించవచ్చనని అన్నారు. అలాగే బయ్యారం స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయవచ్చని అన్నారు. కానీ కేంద్రం అలాంటి ప్రయత్నం చేయడం లేదన్నారు. కేవలం 160 కిలోమీటర్ల దూరంలోని బయ్యారానికి ఐరన్ ఓర్ ఇచ్చేందుకు వీలు కాదని చెప్పి.. 1,800 కిలోమీటర్ల దూరంలోని ముంద్రా (గుజరాత్)కు తరలించేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు.. 2018 సెప్టెంబర్‌లో అదానీ గ్రూప్.. ఐరన్ ఓర్ కంపెనీ పెట్టింది. బైలదిల్లా నుంచి ఐరన్ ఓర్‌ను.. ముంద్రాకు తరలించేలా ప్లాన్ చేసిందన్నారు. వాస్తవానికి బైలదిల్లా గనులు బయ్యారం, విశాఖకు దగ్గరలోనే ఉన్నాయని కెటిఆర్ వివరించారు. బైలదిల్లాలో 1.34 బిలియన్ టన్నుల ఐరన్ ఓర్ లభిస్తుందన్నారు. ఆ గనులు అదానీ చేతుల్లోకి వెళితే విశాఖ ఉక్కుకు, తెలంగాణకు తీరని నష్టం వాటిల్లుతుందని అని కెటిఆర్ వివరించారు.ఈ నేపథ్యంలో బైలదిల్లాను కాపాడుకోవాలంటే ముందుగా విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాలన్నారు. రాజకీయాల కోసమే విశాఖ ఉక్కుపై మాట్లాడుతున్నామనేది అవాస్తవమన్నారు. “ప్రభుత్వ రంగ సంస్థల సంరక్షణ విషయంలో ఎపి ప్రభుత్వ వైఖరిపై తమకు ఆసక్తి లేదన్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందన్నది కాదు.. కేంద్రం ఏం చేస్తుందన్నదే తమకు ముఖ్యమని కెటిఆర్ చెప్పుకొచ్చారు.

బండి మాటలపై తీవ్ర ఆగ్రహం

వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిజెపి నాయకులు చేస్తున్న ఆరోపణలపై కెటిఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు విషయంలో చూపిస్తున్న ఉత్సాహం బయ్యారం విషయంలో ఎందుకు చూపిస్తలేరని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అడుగుతున్న ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. విషయం పరిజ్ఞానం లేని బండికి చెబితే ఒక బాధ… చెప్పకుంటే మరో బాధ అని ఆయన ఎద్దేవా చేశారు. పైగా ఆయనో విచిత్రమైన మనిషి… ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎలా మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడుతాడో అర్థం కాదన్నారు. అందువల్ల బండికి వచ్చిన సందేహం మరెవరికీ రావొద్దనే ఉద్దేశంతో దీనిపై పూర్తి వివరణ ఇస్తున్నట్లు కెటిఆర్ వెల్లడించారు.

కేంద్రాన్ని ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నాం

2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో వివరంగా చెప్పారని కెటిఆర్ తెలిపారు. అదే విధంగా కడపలో కూడా స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా ద్వారా అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టే అవకాశాన్ని పరిశీలిస్తామన్నార్నారు. ఈ నేపథ్యంలో 2014 నుంచి కేంద్రాన్ని అడుగడుగున బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు గురించి ప్రశ్నిస్తూ వచ్చామన్నారు. అయినప్పటికీ కేంద్రం నుంచి తగు స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల మంత్రిగా కొన్ని రోజులు మైన్స్ డిపార్ట్‌మెంట్ చూసిన సమయంలోనూ తాను పలువురు కేంద్రమంత్రులను కలిశానని కెటిఆర్ వెల్లడించారు. ముఖ్యంగా వీరేంద్ర చౌదరి స్టీల్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఎన్‌ఎండిసి 50వ వార్షికోత్సవానికి వస్తే….. హైదరాబాద్‌లోనే ఈ విషయాన్ని అడిగినట్లు తెలిపారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఎందుకు పెడతలేరని అడిగితే.. పరిశీలిద్దామన్నారు. అయితే కొత్తగూడెంలో ఒక ప్లాంట్, ఇంకో దగ్గర ఇంకో పరిశ్రమను పెడదామంటూ చెప్పుకొచ్చారన్నారు. ఇక జూన్ 2018లో స్వయంగా ప్రధాని మోడీని కలిసి బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై వెంటనే తగు నిర్ణయం తీసుకోవాలని వినతి పత్రం కూడా అందజేసినట్లు ఆయన తెవిపారు.

కేంద్రం కుట్రను అర్ధం చేసుకోలేకపోయాం

బైలదిల్లా విషయంలో కేంద్రం కుట్రను తాము పసిగట్టలేకపోయామని కెటిఆర్ తెలిపారు. ఒక కుక్కను చంపాలంటే…ముందుగా దాన్ని పిచ్చికుక్క అని ముద్ర వేయాలన్నారు. ఆ తర్వాత అది పిచ్చికుక్క కాబట్టి కాల్చి చంపామంటే ఎవరూ పెదగాగ పట్టించుకోరన్నారు. సరిగ్గా బైలదిల్లా విషయంలోనూ కేంద్రం ఇదే సూత్రంను అనుసరించిందన్నారు. జపానీస్ స్టీల్ కంపెనీ, దక్షిణ కొరియాకు చెందిన పాష్కో కంపెనీకి బైలదిల్లా నుంచి ఐరన్ ఓర్ సప్లై చేస్తామని 2018 ఏప్రిల్లో కేంద్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. బైలదిల్లాలో ఐరన్ ఓర్ మైనింగ్ స్టార్ట్ చేస్తున్నామని స్పష్టం చేసింది. ఈ ప్రకటన వెలువడగానే 40వేల కోట్లు ( 5బిలియన్ డాలర్లు ) పెట్టుబడితో గుజరాత్‌లోని ముంద్రాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ కంపెనీ పెడుతున్నట్లు అదానీ ఒక ప్రకటన ఇచ్చారు. ఈ క్రమంలో పాష్కో కంపెనీ వైజాగ్‌లో స్టీల్ ప్లాంట్ పెడుతుందా అని ఎపికి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి 2021 అక్టోబర్‌లో పార్లమెంట్‌లో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా… పాష్కో కంపెనీ ఆలోచన చేస్తుందని కేంద్రం సమాధానమిచ్చింది. 2019 అక్టోబర్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి వచ్చి పరిశీలించారు. అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టే ఆలోచనలో ఉన్నారని కేంద్రం బదులిచ్చిందిదన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలకు చావుదెబ్బ

బైలదిల్లా నుంచి బయ్యారానికి ఐరన్ ఓర్ ఇస్తే అదానీకి నష్టం…. అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు సప్లై చేస్తే ముంద్రాలో అదానీ పాష్కో పెట్టాలని సంకల్పించిన ఫ్లాంట్కు నష్టమన్నారు. అందుకే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఒక బైలదిల్లాను అదానీకి కట్టబెట్టడంతో రెండు తెలుగు రాష్ట్రాలను కేంద్రం చావుదెబ్బ తీసిందన్నారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెడదామంటే అదానీకి మన జుట్టు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అదానీ, మోడీ చెప్పినట్లు వినాల్సి ఉంటుందన్నారు. అలా అయితేనే బయ్యారంలో పరిశ్రమను పెట్టొస్తదన్నారు. అందుకే వాళ్లు పెట్టమని అంటున్నారు. కాగా మన రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తున్న కిషన్‌రెడ్డి మాత్రం….బయ్యారం ఈజ్ నాట్ ఫీజబుల్ అని అంటున్నారన్నారు. నాణ్యమైన ఐరన్ ఓర్ అదానీకి అప్పజెప్పినం కాబట్టి…… ఇట్ ఈజ్ నాట్ ఫీజబుల్ ఫర్ స్టీల్ అథారిటీ అని ప్రకటన చేశాడని అన్నారు.అందుకే బయ్యారం స్టీల్ ప్లాంట్ ఆచరణ సాధ్యం కాదని తి కిషన్ రెడ్డి చెబుతారని విమర్శించారు.

బైలదిల్లా నుంచి 150 కిమీ దూరం బయ్యారం ఉందని 600 కిమీ దూరంలో విశాఖ ఉందని సమీపంలో ఉన్నవాటికి ఖనిజాన్ని తరలించడం సాధ్యం కాదని బైలదిల్లా నుంచి 1800 కి.మీ దూరంలో ఉన్న ముంద్రాకు తరలించడం మాత్రం ఏ విధంగా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. వైజాగ్ పొట్టగొడుతూ, బయ్యారంను ఎండపెడుతున్నది మోడీయేనని కెటిఆర్ ఆరోపించారు. అదానీ ఆంధ్రప్రదేశ్‌లో ఏం చేస్తున్నారనేది అందరికి తెలుసన్నారు. కృష్ణపట్నం, గంగవరం పోర్టులను ఇప్పటికే అదానీ గుంజుకున్నారని ఆరోపించారు. దీనిపై ఎవరైనా ఎక్కువగా మాట్లాడితే కేంద్రం నుంచి ఇడి, సిబిఐలు వస్తాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రను, తెలుగు రాష్ట్రాల మీద చేస్తున్న దాడిని, జాతి సంపదను వారి దోస్తులకు దోచిపెడుతున్న విధానాన్ని ప్రజలకు తెలియజేయడానికే తమ ఉద్దేశ్యమన్నారు. ఇందులో భాగంగానే తమ అధికారులు బృందం వైజాగ్ వెళ్లిందన్నారు. ఏం చేయాలనే దానిపై స్టడీ చేస్తోందన్నారు. ఎపి ప్రభుత్వం ఏం చేస్తుందో తమకు అనవసరం లేదన్నారు. తమ పోరాటం కేంద్రం మీదనేనని కెటిఆర్ స్పష్టం చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్దరణకు తాము ఇప్పటికి కట్టుబడి ఉన్నామన్నారు. ఇందుకోసం రూ. 250 కోట్లైనా ఖర్చు పెట్టేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News