న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ బుధవారం నాడిక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఆయన నివాసంలో కలుసుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే ప్రతిపక్షాల ఐక్యతపై ప్రయత్నాలు సాగుతున్న దరిమిలా ఈ సమావేశం జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తమ భేటీని చారిత్రాత్మకంగా ఖర్గే మీడియా వద్ద అభివర్ణించారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ప్రతిపక్షాలను సంఘటితం చేయగలమన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
Also Read: ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు: మండలి చైర్మన్ గుత్తా పైర్
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం నాడే ఢిల్లీకి చేరుకున్నారు. నేడు కాంగ్రెస్ అద్యక్షుడితో భేటీ అయిన ఆయన మరి కొందరు ప్రతిపక్ష నేతలను కూడా కలుసుకునే అవకాశం ఉంది. కాగా..ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణంలో మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఇడి ఎదుట హాజరయ్యేందుకు తేజస్వి యాదవ్ కూడా మంగళవారం నాడే ఢిల్లీకి వచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలలో బిజెపిపై పోరాడేందుకు భావసారూప్యంగల పార్టీలను ఏకం చేసే ప్రయత్నంలో భాగంగా మల్లికార్జున్ ఖర్గే ఇటీవలే పలువురు ప్రతిపక్ష నాయకులతో సమావేశమయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేలతో ఇప్పటికే సమావేశం కాగా మరికొందరు ప్రతిపక్ష నేతలతో త్వరలోనే ఖర్గే సమావేశమయ్యే అవకాశం ఉంది.