Monday, December 23, 2024

’60’ లక్షల మంది కార్యకర్తలే బలం.. ‘బలగం’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ముస్తాబాద్ : సిఎం కేసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట రహదారిలో గల జికె వెంచర్స్‌లో ఏర్పాటు చేసిన బిఆర్‌ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా కెటిఆర్ హజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు, బతుకమ్మలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలంగాణ గాయకుడు సాయిచంద్ ఆలపించిన ప్రభుత్వ పథకాల పాటలు వచ్చిన ప్రజానీకాన్ని ఉర్రూతలు ఊగించాయి. అనంతరం ముస్తాబాద్ మండలంలోని ముస్తాబాద్ మద్దికుంట, మోహినికుంట, తెర్లుమద్ది, మోర్రాపూర్, చీకోడ్, బదనకల్, సేవాలాల్ తండా ప్రజలతోమంత్రి కేటిఆర్ ఆత్మీయంగా కలిసి వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతోనే నేను ఈ స్థాయిలో ఉన్నానని అన్నారు.

తెలంగాణ వస్తే పరిపాలన మీకు సాధ్యమైతదా, పాలించే తెలివి ఉన్నవారు ఉన్నారా అని ఎన్నో మాటలు అన్నారు. నేడు భారత దేశంలో బెస్ట్ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయంటే 20లో 19 తెలంగాణలోనే ఉన్నాయని అన్నారు. పేదలకు కడుపులో పెట్టుకుని ఎలా చూసుకోవాలో అభివృద్ది సంక్షేమ పథకాలు ఎలా చేయాలో దేశానికే తెలంగాణ చూపిస్తుందన్నారు. మా తలసరి ఆదాయం స్థూల ఆదాయం పెరిగినట్లు భారత దేశంలో ఏ రాష్ట్రంలోనైనా పెరిగిందా అని మోదీని అడిగితె సమాధానం లేదన్నారు. భారత దేశంలో జిల్లాకో మెడికల్ కాలేజిలు పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. మోదీ ప్రజల కష్టాలను డబుల్ చేసిండు కానీ ధనాన్ని కాదు, 400 ఉన్న సిలిండర్ ధరను 1200లు చేసిండని అన్నారు. పెట్రోల్, డీజిల్ 60,70 రూ.లు ఉన్నప్పుడు తాను ప్రధానమంత్రి అయితే 40 రూపాయలకు ఇస్తానని ఇప్పుడు 100కు పైగా పెంచిండని అన్నారు. నరేంద్ర మోడీ వల్ల ఏ ఒక్కరికైనా లాభం జరిగిందా ఆలోచించండి అని అన్నారు. ఎంపి అయిన తరువాత సిరిసిల్ల నియోజకవర్గానికి ఇది చేశానని చెప్పుకునే దమ్ము ధైర్యం బండి సంజయ్‌కు ఉందా అన్ని ప్రశ్నించారు.

60లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ మనది అని, వారి కుటుంబాల ఆశీర్వాదం ఉంటే మళ్లీ మూడోసారి 100 స్థానాలు గెలవడం ఖాయమని అన్నారు. ఈ 60లక్షల మంది బలగ ఆశీర్వదిస్తే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి కెసిఆర్ హ్యట్రిక్ ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టిస్తారని అన్నారు. పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి కుటుంబ సభ్యునికి పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు. సిఎం కేసిఆర్ ప్రవేశపెడుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.

సిఎం కేసిఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా, పింఛన్‌లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టి నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. కాళేశ్వరం జలాలలో చెరువులు, కుంటలు సస్యశ్యామలం అయ్యాయని అన్నారు. ఇంతటి అభివృద్దిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినిపల్లి వినోద్ కుమార్, జిల్లా ఇంచార్జీ బస్వరాజు సారయ్య, టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, జెడ్పి చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, ఎంపిపి జనగామ శరత్ రావు, రైతు బంధు మండల అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్ రావు, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్, మండల పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News