హైదరాబాద్ : రాజ్యాంగ రూపశిల్పి, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ఆచరించడం, అందుకు అనుగుణంగా ప్రతి ఇక్కరూ నడుచుకోవడం ద్వారానే అన్ని జాతుల కులాల ప్రజలకు సమగౌరవం లభిస్తుందని తద్వారా నవ భారత నిర్మాణం సాధ్యం అవుతుందని సింగరేణి సంస్థ డైరెక్టర్ ( ఫైనాన్స్ అండ్ పర్సనల్ ) ఎన్. బలరామ్ పిలుపు నిచ్చారు. హైదరాబాద్ సింగరేణి భవన్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించిన అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో బడుగు, బలహీన, హరిజన, గిరిజన, మహిళా వర్గాలకు సమహోదా కలిగించడం కోసం అనేక ప్రత్యేక సూచనలు చేశారని, వీటిని అమలు జరుపుతున్న ప్రభుత్వ సంస్థల్లో సింగరేణి కాలరీస్ సంస్థ దేశంలోనే అగ్రగామిగా ఉంటోందని బలరామ్ పేర్కొన్నారు. దేశంలో ఏ ఇతర బొగ్గు పరిశ్రమల్లో లేని విధంగా సింగరేణి సంస్థలో అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14వ తేదీని సెలవు దినంగా ప్రకటించడం జరిగిందన్నారు. అలాగే ఉత్సవాల నిర్వహణకు ప్రతి ఏరియాకు లక్ష రూపాయలను కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు.
విశిష్ట అతిథిగా పాల్గొన్న డైరెక్టర్ ( ఈ అండ్ ఎం) డి.సత్యనారాయణ రావు మాట్లాడుతూ కుల, జాతి, వివక్షత తీవ్ర స్థాయిలో ఉన్న ఆ కాలంలో కూడా అంబేదర్కర్ అనేక కష్టాలను సహించి ఉన్నత స్థాయికి ఎదిగారని ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం అని అన్నారు. జనరల్ మేనేజర్ ( కోఆర్డినేషన్) ఎం. సురేష్ మాట్లాడుతూ భారతదేశంలో అసమానతల తగ్గుదలకు, బడుగు వర్గాల అభివృద్ధికి అంబేద్కర్ అందించిన రాజ్యాంగమే ప్రధాన ఊతమని, భారత రాజ్యాంగ స్పూర్తితోనే సింగరేణి సంస్థ ముందుకు నడుస్తోందని పేర్కొన్నారు.
జనరల్ మేనేజర్ ( ఫైనాన్స్) ఎం. సుబ్బారావు మాట్లాడుతూ అంబేద్కర్ రచనలు ప్రతి ఒక్కరూ చదవాలని అంబేద్కర్‌పై సమగ్ర పరిశోధనాత్మక గ్రంథాలు రావాలని సూచించారు. సింగరేణి ఉద్యోగి, ప్రజా కవి జయరాజు అంబేద్కర్ జీవిత విశేషాలను ఉత్తేజపూరితంగా వివరించారు. సమాజ చైతన్యానికి కృషి చేస్తున్న జయరాజును ఈ సందర్బంగా అతిథులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పిఆర్ అడ్వైజర్ గణాశంకర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా ప్రజా సంబంధాల అధికారి శ్రీకాంత్ వందన సమర్పణ చేశారు.