Monday, December 23, 2024

వచ్చే పదేండ్లలో మరో మహమ్మారి ?

- Advertisement -
- Advertisement -

లండన్ : కోవిడ్ వంటి మరో మహమ్మారి ప్రపంచంలో వచ్చే పది సంవత్సరాలలో సంభవిస్తుందని ఓ నివేదికలో వెల్లడైంది. కరోనా వైరస్ తరువాత పలు రకాల వైరస్‌లు తలెత్తడంతో తిరిగి ఇటువంటి తీవ్రస్థాయి వైరస్ వ్యాపించే అవకాశాలు 27.5 శాతం వరకూ ఉన్నాయని బ్లూమ్‌బెర్గ్ వెలువరించిన విశ్లేషణలో తెలిపారు. పలు దేశాలలో ఇప్పటికీ కొంత స్థాయిలో, కొన్ని ప్రాంతాలలో కరోనా వైరస్ పలు ఉపరకాలుగా సత్తా చాటుతోంది. గత కొద్దిరోజులుగా భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో ఈ వైరస్‌తో అత్యధిక సంఖ్యలో చికిత్స పొందుతున్నారు. కరోనా మహమ్మారి దశ ముగిసింది. అయితే ఇది అంతరించిపోకుండా ఇప్పుడు సీజనల్ ఫ్లూ స్థాయిని సంతరించుకుంది. అయితే వైరస్‌ల తగ్గని ఉనికి, మనిషి శారీరక రోగనిరోధక శక్తితో వైరస్ సయ్యాటల క్రమంలో వచ్చే పది సంవత్సరాలలో ఎప్పుడైనా కరోనా వంటి మరో తీవ్రస్థాయి వైరస్ సంక్రమణం జరిగే వీలుందని ఎయిర్‌ఫినిటి నివేదికలో తెలిపారు.

అయితే ఇంతకు ముందటి కరోనా వైరస్ తలెత్తిన దశలోని విషయాలను గుర్తుంచుకుని తక్షణమే స్పందిస్తే, దీని ఉనికిని కనుగొన్న తరువాత కనీసం వంద రోజుల్లో అయినా సంబంధిత వైరస్‌కు తగు టీకాలు ఇతరత్రా నివారణ చర్యలు ఉధృతం చేస్తే మహమ్మారి దశకు చేరుకునే అవకాశాలు 8.1 శాతానికి దిగజారుతాయి. అయితే మెర్స్ లేదా జికా వంటివి ఇప్పటికీ ఎటువంటి వ్యాక్సిన్లకు లొంగడం లేదు. ఇవి తీవ్రతరం అయితే పరిస్థితి దిగజారుతుందని ఆందోళన వ్యక్తం అయింది. బర్డ్‌ఫ్లూ రకం వైరస్‌లు ఎక్కువగా సంక్రమణ లక్షణాలను సంతరించుకుని ఉన్నాయి. ఇవి మనుష్యుల నుంచి మనుష్యులకు ఎక్కువగా అంటుకుంటాయి. మ్యుటేషన్స్ ఎక్కువగా జరుగుతాయి. రోజుకు కనీసం 15000 మందిని అయినా ఈ రకం వైరస్ కబళిస్తుంది. హెచ్5ఎన్1 బర్డ్‌ఫ్లూ రకం అత్యంత వేగంగా వ్యాప్తి చెందే స్థాయిలో ఉండటం ఆందోళనకర పరిణామమని ఎయిర్‌ఫినిటీ నివేదికలో తెలిపారు. ఇప్పటికీ పలు దేశాలలో సరికొత్త మహమ్మారి కారక వైరస్‌లను సకాలంలో గమనించే లేదా పర్యవేక్షించే పద్ధతి లేదని , ఇది చాలా తీవ్ర అంశం అని స్పష్టం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News