సంబల్‌పూర్: ఒడిషాలోని సంబల్‌పూర్ పట్టణంలో పోలీసులు శనివారం ఉదయం నుంచి నిషేధాజ్ఞలు విధించారు. శుక్రవారం రాత్రి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం, ఒక వ్యక్తి అనుమానాస్పద రీతిలో మరణించడంతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య హనుమాన్ జయంతి శోభాయాత్ర జరిగిన తర్వాత సంబల్‌పూర్ పట్టణంలో హింసాత్మక ఘటనలు సంభవించాయి.
ముందు జాగ్రత్త చర్యగా పట్టణంలో కర్ఫ్యూ విధించినట్లు అధికారులు తెలిపారు. తదుపరి ఉత్తర్వుల వరకు సంబల్‌పూర్ పట్టణంలో 144(1) సెక్షన్ కింద కర్ఫ్యూ అమలులో ఉంటుందని జిల్లా సబ్ కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ప్రజలు నిత్యావసర సరుకుల కోసం ఉదయం 8 నుంచి 10 వరకు, తిరిగి సాయంత్రం 3.30 నుంచి 5.30 వరకు బయయటకు రావచ్చని ఆయన పేర్కొన్నారు.
సంబల్‌పూర్ పట్టణంలోని అన్ని విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను మూసివేసినట్లు జిల్లా కలెక్టర్ అనన్య దాస్ తెలిపారు.