Monday, December 23, 2024

అన్నదమ్ముల కథ.. ఎవరు హీరో.. ఎవరు విలన్?

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: తమిళనాడులోని ఒక కుగ్రామం నుంచి సినిమాల్లో ఛాన్సుల కోసం ఇద్దరు అన్నదమ్ములు మద్రాసు వచ్చేశారు. సంగీత విద్వాంసులు కానప్పటికీ ఇద్దరికీ సంగీతంలో ప్రవేశం ఉంది. ఇద్దరూ బాగా పాడగలరు. ఇద్దరూ గిటారిస్టులే. అన్నకు తొందరగానే ఒక సంగీత దర్శకుడి ద్దగర అసిస్టెంటుగా చేరే అవకాశం దక్కింది. ఆ తర్వాత తమ్ముడు కూడా అదే సంగీత దర్శకుడి దగ్గర సహాయకుడిగా చేరిపోయాడు. అన్నదమ్ములిద్దరూ మంచి మ్యుజిషన్స్‌గా అక్కడ పేరు సంపాదించుకున్నారు. పాటలు రాయడం తమ్ముడికున్న అదనపు అర్హత.

కొన్నేళ్ల కష్టం తర్వాత అన్నకు సంగీత దర్శకుడిగా అవకాశం లభించింది. ఆ సినిమాలోని పాటలు తమిళనాడును ఉర్రూతలూగించాయి. అప్పటివరకు వినని ఒక కొత్త సంగీతాన్ని తమిళనాడు ప్రజలు ఆలకించారు. దీంతో అన్న పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. వరుస అవకాశాలతో బిజీ అయిపోయాడు. తమ్ముడు కూడా అన్న వెంటే ఉండిపోయాడు. గిటారిస్టుగా, పాటల రచయితగా అన్నతోపాటే పయనం ప్రారంభించాడు.

కొన్నాళ్ల తర్వాత తమ్ముడికి కూడా సంగీత దర్శకత్వం వహించే చాన్స్ దక్కింది. తమ్డుడిలోని ప్రతిభను గుర్తించిన అతని మిత్రులు కొందరు తాము తీస్తున్న సినిమాకు సంగీత దర్శకత్వం వహించమని అతడిని అడిగారు. తమ్డుడుఒప్పుకున్నాడు. అయితే ఈ విషయం వెంటనే అన్నకు చెప్పలేదు. ఈ విషయం ఎలాగో అన్నకు తెలిసింది. కోపం కట్టలు తెంచుకుంది. నా దగ్గర ఇక పనిచేయాల్సిన అవసరం లేదంటూ తమ్ముడిని రికార్డింగ్ థియేటర్ నుంచి బయటకు పంపేశాడు. చేతిలోని గిటార్‌ను కూడా లాక్కున్నాడు. తమ్ముడు ఏడుస్తూ థియేటర్ బయట నిలబడ్డాడు. అప్పటిదాకా అన్నతోనే లోకం అనుకున్న అతడికి ఒక్కసారి ఒంటరితనం ఆవహించింది. కళ్ల నుంచి ధారాపాతంగా నీళ్లు కారుతున్నాయి.

అప్పుడే అటుగా వచ్చిన వారి మొదటి సంగీత గురువు తమ్ముడిని చూశాడు. ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నించాడు. తమ్ముడు జరిగిన విషయం చెప్పాడు. వెంటనే తనతో రమ్మని చెప్పి రికార్డింగ్ థియేటర్‌లోకి నడిచాడు ఆ సంగీత దర్శకుడు. ఇదేం పోయే కాలం నీకు అంటూ అన్నను నిలదీశాడు. తమ్ముడికి అవకాశం వస్తే నీకెందుకు అంత అసూయ అంటూ కడిగేశాడు. సంగీత దర్శకుడిగా నీకు అవకాశం ఇవ్వమని చాలామంది నిర్మాతలకు నేనే రికమెండ్ చేశాను కాని నీకు అడ్డుపడలేదు కదా అంటూ ఆయన చెప్పడంతో అన్నకు నోటమాట రాలేదు.

అయిష్టంగానే తమ్ముడిని మళ్లీ తన దగ్గర పనిలో పెట్టుకున్నాడు. సీన్ కట్ చేస్తే.. తమ్ముడు సంగీత దర్శకత్వం వహించిన సినిమా హిట్టయ్యింది. పాటలు పాపులర్ అయ్యాయి. తమ్ముడికి కూడా వరుస సినిమా అవకాశాలు రాసాగాయి. అన్న కాల్‌షీట్లు దొరకని నిర్మాతలు తమ్ముడిని సంప్రదించసాగారు. ఆరకంగా తమ్ముడు కూడా సంగీత దర్శకుడిగా బిజీ అయిపోయాడు. తమ్ముడికి పాటల రచయిత కూడా కావడంతో దర్శక నిర్మాతలకు అతడు మరింత ఇష్టుడైపోయాడు. తమ్ముడి పాపులారిటీగురించి అన్నకూ తెలిసిపోయింది. కట్ చేస్తే.. అన్నదమ్ములిద్దరికీ సన్నిహితులైన కొందరు ఒక రోజు తమ్ముడిని అన్న దగ్గరకు పిలిచారు. నువ్వు ఇక సినిమా సంగీతం కట్టిపెట్టి సినీ దర్శకుడిగా మారమని సలహా ఇచ్చారు. ఆ సినిమా అవకాశం కూడా తామే ఇస్తున్నట్లు ప్రకటించేశారు.

అయితే.. తన చేతిలో సంగీతం చేయాల్సిన సినిమాలు పాతిక ఉన్నాయని, వాటి సంగతేంటని తమ్ముడు ప్రశ్నించాడు. వాటి సంగతి అన్న చూసుకుంటాడులే అని వాళ్లు సర్చిచెప్పారు. అక్కడే ఉన్న అన్న కూడా మిత్రుల మాటలనే సమర్ధించాడు. తప్పని పరిస్థితుల్లో తమ్ముడు సంగీత దర్శకుడిగా అవతారం చాలించి సినీ దర్శకుడిగా మెగాఫోన్ పట్టాడు. సీన్ కట్ చేస్తే..
అక్కడ కూడా తమ్ముడిని అదృష్టం వదిలిపెట్టలేదు. అతడు దర్శకత్వం చేసిన మొదటి సినిమా పెద్ద హిట్. ఆ సినిమాకు అన్నే సంగీత దర్శకుడు. పాటలు కూడా హిట్. కాంబినేషన్ బాగుందన్న సెంటిమెంట్‌తో వరుసపెట్టి దర్శకుడిగా సినిమా అవకాశాలు తమ్మడికి మొదలయ్యాయి.

తమ్ముడి దర్శకత్వంలో అన్న సంగీత దర్శకుడిగా విడుదలైన ఒక సినిమా సూపర్ హిట్టయ్యింది. సిల్వర్ జుబిలీ పూర్తి చేసుకుంది. మళ్లీ కట్ చేస్తే.. మళ్లీ మిత్రబృందం మీటింగ్‌కు పిలిచిది. నీ పద్ధతేం బాగాలేదని మందలించింది. సంగీత దర్శకుడిగా నీ అన్న ఒక్కడే కష్టపడుతుంటే నీపాటికి నువ్వు దర్శకత్వం చేసుకుంటూ వదిలేస్తావా అని తిట్టారు. వెంటనే ఆ మెగా ఫోన్ పక్కన పడేసి అన్న దగ్గరకు వచెయ్యమన్నారు. అన్నకు చేదోడువాదోడుగా ఉండిపొమ్మన్నారు. దాంతో గత్యంతరం లేక తమ్ముడు దర్శకుడిగా తాను సంపాదించుకున్న కీర్తిప్రతిష్టలను మూటడట్టి అటకమీద పడేసి మళ్లీ అన్న దగ్గర మ్యూజిక్ కండక్టర్‌గా చేరిపోయాడు.

అలా తన కోరికను చంపేసుకుని బతుకును సాగదీశాడు. కాని తమ్ముడి కొడుకు మాత్రం తండ్రిలాంటి వాడు కాదు. అతడు ఇప్పుడు ఒక స్టార్ డైరెక్టర్. అన్న కుమారులు మాత్రం తండ్రి బాటలోనే నడుస్తున్నారు. ఈ కథంతా తమ్ముడు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పిందే. తమ్ముడికి ఇప్పటికీ అన్నంటే చెక్కుచెదరని అభిమానం ఉంది. తాను చిత్రపరిశ్రమలో కాలుపెట్టడానికి తన అన్నే కారణమని వినయంగా చెబుతాడు. అన్న ఎవరు..తమ్ముడు ఎవరు..ఎవరు హీరో. ఎవరు విలన్ అన్నది పాఠకుల ఊహకే వదిలేస్తున్నాము.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News