హుజూర్‌నగర్ : సూర్యాపేట జిలా హుజూర్‌నగర్ పట్టణంలోని లింగగిరి రోడ్డులో శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరో 15 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారు హుజూర్‌నగర్‌లోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర గాయాలైన ఇద్దరు వ్యక్తులను మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట జనరల్ ఆసుపత్రి కి తరలించారు. ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పట్టణంలోని లింగగిరి రోడ్డులో ఉదయం 8గంటల ప్రాంతంలో బీహార్‌కు చెందిన కూలీలు ట్రాలీ ఆటో ఎక్కుతుండగా ఎదురుగా భారీ లోడుతో వస్తున్న లారీ ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో బీహార్‌కు చెందిన గుల్జార్ (35) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి స్వస్థలం బీహార్ రాష్త్రంగా బాధితులు తెలిపారు. అదే విధంగా ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. లారీ బలంగా ఆటోను ఢీ కొట్టడంతో ఆటో పక్కన ఉన్న ఇంటిని బలంగా గుద్దుకుంది. దీంతో ఇంటి గోడ కూడా పూర్తిగా కూలిపోయింది. తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆటోలు ఉన్న బబ్లూ, రాజ్‌కుమార్, తన్వీర్, ఫసిక్, సబురుద్ధీన్, రోహిత్, షాన్వార్, సోను, రాజ్, పశ్చా జీత, ఫరోద్‌లకు స్వల్ప గాయాలు కాగా వీరు బీహార్‌కు చెందిన వ్యక్తులు. ఈ ప్రాంతంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని హుజూర్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ప్రాంగణంలో బంధువుల రోదనలు కనిపించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.