Saturday, November 23, 2024

1818 ఇండియా!

- Advertisement -
- Advertisement -

1818 జనవరి 1వ తేదీన భీమానదికి సమాంతరంగా రక్తపుటేర్లు ప్రవహించాయి. మరాఠీ నేలపై ఆధిపత్య వర్గాల అణచివేతను దళిత వర్గాలు అడ్డుకున్న రోజది. పీష్వాలపై ఈస్ట్ ఇండియా కంపెనీతో కలిసి మరాఠీ మహర్లు భీమేకొరేగావ్ వద్ద జరిపిన యుద్ధం విజయవంతమయ్యింది. పీష్వాలు తోకముడిచారు. ఆ యుద్ధం దళిత శౌర్యానికి, త్యాగానికి ప్రతీక. మహర్లు అకుంఠిత దీక్షతో జరిపిన పోరాటంలో వందలాది మంది వీరమరణం పొందారు. తదనంతరం వారి త్యాగాలను స్మరిస్తూ ఆయా వర్గాల వారు ఓ స్మారక స్థూపం నిర్మించుకోవడంలో ఆశ్చర్యమేముంది? ప్రతి ఏడాది వారంతా ఆ స్థూపం దగ్గరకు పోయి నివాళులర్పించడం కూడా సర్వసాధారణమే కదా! మరి ఇలాంటి సాధారణ విషయాన్ని చూసి ఏదో తప్పు చేసిన్నట్లు ఆధిపత్య వర్గాలు భావించాయి. దానిలో భాగంగా 2018 జనవరి 1 న ఆ చారిత్రక యుద్ధం జరిగి 200 ఏళ్లు అయిన సందర్భంగా ఎల్గార్ పరిషత్ సభ్యులు గుమిగూడి తమ స్ఫూర్తిని చాటుకున్నారు.

ఈ ఐక్యతను చూసి కన్నెర్ర చేసిన అగ్రవర్ణాలు దళితులపై దాడి చేసారు. అప్పటినుంచి ఈ దేశ రాజకీయాలలో ఈ సంఘటనపై కీలకమైన చర్చ నడుస్తున్నది. దీనిపై మనువాదులు సాంస్కృతిక రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. దీనిలో భాగంగానే 16 మంది మేధావి వర్గాన్ని ’ఉపా చట్టం’ కింద అరెస్టు చేయడం జరిగింది. వీరిలో చాలామందికి న్యాయస్థానంలో బెయిల్ దొరక్క జైళ్లలో మ్రగ్గడం విదితమే.
1927లో అంబేద్కర్ మహాశయుడు భీమేకొరేగావ్ స్థూపాన్ని సందర్శించడంతో 1818పోరాటానికి మరింత ప్రాముఖ్యత పెరిగింది. ఈ మొత్తం వ్యవహారానికి మద్దతుగా కవి ’పుప్పాల శ్రీరామ్’ చలించిపోయి రాసిన దీర్ఘకవిత 1818. ఇది కచ్చితంగా స్ఫూర్తిదాయకమైన కవిత్వమంటాను.

‘నేను భీమానదిని మాట్లాడుతున్నాను/చరిత్ర కన్నుల్లోంచి/ దుఃఖపు చెమ్మనై చిప్పిల్లుతున్నాను/మూగబోయిన అలల తీగలపై/పురిటి బిడ్డల తొలి ఏడుపునై/పెల్లుబుకుతున్నాను’ అనే వాక్యాలతో దీర్ఘకవిత గంభీరంగా ఆరంభమవుతుంది. కవి భీమానదిని ఆవాహనం చేసుకుని గత కాలపు దుఃఖపు జీవిత గమనాలను ఆర్ద్రంగా ప్రవహింపజేస్తూ, వర్తమాన పాలకుల వైఖరులను ఎండగడతాడు. కవి నదిలోకి పరకాయ ప్రవేశం చేయడంతోనే పాఠకులకు ఓ కొత్త అనుభూతి కలుగుతుంది. మొత్తం కవిత ఉద్వేగంతో సాగుతుంది. పాఠకులను క్షణం నిలువనీయదు. నరాలు బిగబట్టి చదివింపజేస్తుంది. తిరుగుబాటు పట్ల సానుభూతిని ప్రకటిస్తుంది. పఠితులు కూడా ఆదిశగా ఆలోచన చేసేలా కవిత ఉంటుంది. అదే కదా! ఉత్తమ సామాజిక కవిత్వ లక్షణం.

‘అగాధాల్లో పూడిపోయిన రాచరికాన్ని/మళ్ళీ వూరేగిస్తోన్న రాచవీధుల్లోంచి నడచి వస్తున్నాను’ రాచరికపు దురహంకారాలకు 1818 పోరుబాట ఒక నిరసన గళం. దాన్ని ఒక వైపు గుర్తుచేస్తూ, మరోవైపు రెండు శతాబ్దాల ’అగాధాల్లో పూడిపోయిన రాచరికాన్ని/మళ్ళీ వూరేగిస్తోన్న రాచవీధుల్లోంచి నడచి వస్తున్నాను’ రాచరికపు దురహంకారాలకు 1818 పోరుబాట ఒక నిరసన గళం. దాన్ని ఒక వైపు గుర్తుచేస్తూ, మరోవైపు రెండు శతాబ్దాల అనంతరం జరిగిన అణగారిన వర్గాల ఐక్యతపై జరిగిన నయా రాచరికపు పోకడలను, వాటిని ఎత్తుకుంటున్న పాలకుల ద్వంద్వ వైఖరిని తూర్పారబడతాడు కవి. వారు మానవవాదాన్ని మరిచిపోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తాడు కూడా.

‘కొన్ని తేదీలు/ క్యాలెండర్ లో పేజీలు తిప్పనివ్వవు/2018 జనవరి ఒకటి గుర్తొస్తే/ఒక ఆత్మగౌరవ చైతన్యం నోరారా పిలుస్తుంది/తరాల ఇసుక తిన్నెల కింద/మూగబోయిన శంఖం లాంటి నాదాలు వినిపిస్తాయి’ ఇలా పరిషత్ సభ్యులు జరిపిన అసమాన పోరాటాన్ని శ్లాఘిస్తాడు కవి. అణువణువునా స్ఫూర్తిని నింపుకుని మననం చేసుకుంటాడు. అంతేనా అంటే కాదు ’తనని తాను పోగొట్టుకోవడం/మళ్లీ పురుడు పోసుకోవడం/ఒక్క విప్లవానికే చెందిన రసవిద్య’ అంటూ విప్లవాన్ని తేజోమయమైనదిగా ఉద్ఘాటిస్తాడు కవి.

‘కవిత్వం ఎక్కుపెడుతున్న విలుకాణ్ణి/కరెంటు ఫెన్సింగ్ వేస్తున్నారు/వీల్ చైర్ తో నడుస్తున్నవాణ్ణి/తుపాకీతో సెంట్రీ కాస్తున్నారు’ అంటూ పాలకులు అర్బన్ నక్సల్స్ పేరిట రచయితలు, సామాజిక కార్యకర్తలపై పెడుతున్న కుట్రలను నిరసిస్తాడు. ఇంకా మూలవాసుల ఉద్యమ నేపథ్యాన్ని వీరోచితంగా కవి జ్ఞప్తికి తెస్తాడిలా. ‘అది వేటకెళ్ళిన రాజుగారి కథ కాదు/రాజును వేటాడిన సైనికులు కథ/కటిక చీకటిలోంచి/కడగండ్ల దారుల మీంచి/జవగల గుర్రంలా పరిగెత్తిన కథ’ అని అంటాడు. ‘కాళ్ళకి చెప్పుల్లేని నేల/సిగ్గు కప్పుకునేందుకు/గుడ్డ పీలికలేని నేల/నేల మెడ చుట్టూ/ ముంతల బరువుకు/ కమిలిన గుర్తులుంటాయి/వొళ్లంతా తాటాకు మొనలు/గీరుకున్న గాయాలుంటాయి’ ఇలా అణగారిన వర్గాలను నేలతల్లితో పోల్చుతాడు కవి. ఈ పోలిక ఉదాత్తంగా ఉంది. ఓర్పుకు ప్రతీక నేలతల్లి. ఓర్చి ఓర్చి అది ఒక్కోసారి విస్ఫోటనం చెందుతుంది. ప్రళయ భీకర వాతావరణాన్ని సృష్టిస్తుంది. అలాగే బాధితులు కూడా కొంతమేరకే ఓర్పు వహిస్తారు. తదనంతరం తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గంగా విప్లవాన్ని ఎంచుకుంటారు. కవి విప్లవోద్యమం పట్ల ఆసక్తి కనబరుస్తారు.

‘ఈ యుద్ధానికి తొలి ఆయుధ పూజ ఆదివాసీ అమ్మదే/అరటి దోనెల్లో దీపాలైన వారంతా తోబుట్టువులే/ఇది పత్రహరితాన్ని వేటాడ్డం/ ఇది సాల్వాజుడుం/అన్నల్ని చంపమని/తమ్ముళ్ళని ఎగదోయడం/అక్కల పాలిండ్లలో తల్లితనాన్ని నలపడం/ఇది అరాచకం, ఈ యుద్ధం అంతం కావాలి’ అంటూ ఆదివాసీలు మొదలుపెట్టిన ఈ పోరుపై వివిధ ఆపరేషన్ల పేరిట రాజ్యం చేపడుతున్న దుర్నీతిని దునుమాడతాడు కవి. అడవిలో జరిగే కార్పొరేట్ శక్తుల దోపిడీని ప్రశ్నించే ఆదిమ వాసులపై కూంబింగ్ లు జరపడం, గ్రైనేడ్లు విసరడాన్ని తప్పుబడతాడు. చెట్ల నరికివేత, ఖనిజాల దోపిడీలు చేస్తూ విశృంఖలంగా ఆదివాసీల మనుగడకు పర్యావరణానికి హాని కలిగిస్తున్న నయవంచకుల దౌష్ట్యాలను నిరసిస్తున్న మూలవాసుల మనుగడపై పోలీస్ రాజ్యం పడగవిప్పడాన్ని ప్రశ్నిస్తాడు కవి. బోగస్ నివేదికలను సృష్టించి పచ్చ సంతకాలు గీసి నిరసన కారులపై కుట్ర కేసులు బనాయించడం పట్ల వేదనకు గురౌతాడు కవి.

‘నేను భీమానదిని/తూటికాడ పూల కౌగిలింతలు తప్ప/నా నడుం చుట్టూ/ఏ బెల్టు బాంబులూ చుట్టుకుని లేను/ఇంతకాలం మెడలు వంచిన/గొర్రెలన్నీ మందగడితే నచ్చడం లేదు/నెలవంకల నీడన/అడివి చలిమంటలు కాగితే/సహించడం లేదు’
పాలకులు ప్రజాచైతన్యాన్ని ఎప్పుడూ సహించరు. వారి నైజం అదే. పాలకుల చేతిలో రాజ్యం కీలుబొమ్మ. ఎల్లప్పుడూ ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతూనే ఉంటుంది. పిడికిలెత్తే వారిని అణగద్రొక్కుతుంది. మాటాడే వారిని మక్కలిరగతంతుంది. పాట పాడే వారి గొంతు నులుముతుంది. గజ్జెకట్టే వారి కాళ్లు విరగ్గొడుతుంది. కలం పట్టే వారి కలాలని గుంజుకుంటుంది. ’పాటగాడి పరవళ్ల మీద/తాళం కప్ప వేలాడుతుంది/క్లాస్ రూం లోని పాఠానికి/ఖైదీ సంఖ్య కేటాయిస్తారు/పాల పొదుగుల మీద, చిదుగు పుల్లల మీద/అక్షరాల వాకిట్లోకి/ఆలుబిడ్డల రక్తకణాల్లోకి/నిఘా కళ్ళు జల్లెడపడుతున్నాయి/నియంత రెచ్చగొడుతున్నాడు/నేరం రుజువు కాకుండా మరణించేట్టు/చార్జిషీటు తయారవుతుంది/వొణుకుతున్న చేతుల్లోంచి ప్రాణం/నీళ్ల గ్లాసులా జారిపోతుంది’ ఇలా ఉద్యమకారులపై నిఘా కళ్ళు నిత్యమూ విషం గ్రక్కుతూనే ఉంటాయంటాడు కవి.

ఇక చరిత్ర రాసినవారిని కవి వెటకరిస్తాడిలా. ’చరిత్ర రాసినవాడు/అంతఃపురంలో వున్న రాణుల పాదాలకు/పారాణి పూస్తాడు/సామ్రాజ్యాలు చుట్టి వచ్చిన/రాజుగారి గుర్రపు డెక్కల కచేరీ చేస్తాడు’ రాచరికానికి సాగిలపడుతూ ఊడిగం చేసే చరిత్రకారుల వక్రభాష్యాలను చీదరిస్తాడు కవి. సామాన్యుల జీవన పోరాటాలను, మానసిక సంఘర్షణలను లిఖించకపోవడాన్ని తప్పు పడతాడిలా. ’హుగ్లీ నదిని దాటి/పలాషీ యుద్ధం గెలిచిందెవరో/ఆఖరి మరాఠా పోరులో/నేలకొరిగిన మహర్ వీరులెవరో’ అన్న విషయాలు వీళ్ళ కళ్ళకు కానరావు. వీళ్లు కళ్ళకు గంతల కట్టి చరిత్ర లిఖిస్తున్నారా? అని కవి హేళన చేస్తాడు. మరింత ముందుకు పోయి చరిత్ర యొక్క అస్తిత్వాన్ని ’చరిత్రది ఒఠ్ఠి బానిస పోలిక/పరాధీన సౌందర్యం’ అంటూ పోలుస్తాడు కవి.
ఈ నేలపై ఎన్నో మందిరాలు, గాలి గోపురాలు, చారిత్రక కట్టడాలు చరిత్ర జ్ఞాపకాలుగా మిగిలి ఉన్నాయి. నయా పాలకులు వీటిని గొప్పగా కీర్తిస్తారు.

ఏ రాజో, ఏ రాణియో కులికిన,పాత విలాస మందిరాలు నేడు సుందర రూపాలు దాల్చుకుంటున్నాయి. రాచరికపు ఆనవాళ్లకు గుర్తుగా కొత్త భవనాలు వెలుస్తున్నాయి. వీటిని సందర్శించమని పురమాయిస్తున్నారు. తప్పితే పోరాట చిహ్నాలుగా మిగిలి, స్ఫూర్తివంతంగా నిలిచే అమర స్థూపాలను ఏ విధంగానూ ఎత్తుకోరు వీరు. అప్రాధాన్య ప్రదేశాలుగా చూస్తారు. పైగా వీటి వద్దకు ఎవరైనా వెళితే అరాచకవాదుల క్రింద అరెస్టులు చేస్తున్నారు. ’నిజానికి/ మట్టైపోయిన పక్కటెముకులే/స్థూపాలై తలెత్తుకు నిలబడతాయి/అవి/ఉడుకు నెత్తురు వెల్లవేసుకున్న ఇంటి గోడల్లా ఉంటాయి/కోతలయ్యాక కొడవళ్ళిక్కడ నెలవంకలై వచ్చి వాల్తాయి/అవి సాంచీ స్థూపాలు కాదు/తోకల్లేని సింహాలు కూర్చున్న సారనాథుడు కాదు/అవి వెయ్యి ఉరులు బిగిసిన మర్రి చెట్లు/పిస్తోళ్ళు చీల్చిన ఇంద్రవెల్లి గోండువాని గుండె/విషాహారం తిన్న మానాల గుట్ట/నాకిప్పుడు ఏ స్థూపాన్ని చూసినా/కోరేగాం గుర్తొస్తున్నది’ అని అమరవీరుల స్మారక స్థూపాల ప్రాముఖ్యతను దేదీప్యమానంగా కవన యోధుడు కీర్తిస్తాడు.

‘నేను భీమానదిని ఆఖరిసారి హెచ్చరిస్తున్నాను/ఇండియా/సాయిబాబాని విడిచిపెట్టు/నా ప్రియాతి ప్రియమైన కవి/ వరవరరావును కూడా/స్టాన్ స్వామి సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచు’ అంటూ కవి తన కవితా పంక్తులలో ఉద్యమకారుల త్యాగాలను కొనియాడుతూ, అరెస్టు అయిన వారిని విడిచిపెట్టాలని భారత్ ను గట్టిగా డిమాండ్ చేస్తాడు.
నిర్బంధపు కాలములో ఈ కవితా వస్తువును ఎంచుకోవడంలోనే శ్రీరామ్ ధైర్యసాహసాలు అగుపడతాయి. ఈ కవిత ద్వారా బహుజనలంతా ’జైభీం’ అంటూ ఏకం కావాలని కవి కోరుకుంటాడు. ఈ క్రమంలో దళిత వాదులంతా వామపక్ష ఉద్యమం పట్ల సానుకూలత కలిగియుండాలంటారు. ’విప్లవ, దళిత, బహుజన ఉద్యమాల ఉమ్మడి లక్ష్యాలని, వాటిల్లో రావలసిన తప్పనిసరి మార్పుని చాలా చాకచక్యంగా కవిత్వం చేసిన పద్యం ఇది’ అన్న ’పల్లిపట్టు నాగరాజు’ మాటల్లో నూటికి నూరుపాళ్ళు నిజముంది. అయితే ఈ మూడు వాదాలలో మౌళికమైన తేడా ఉంది. వీరి దారులు వేరు వేరుగా ఉన్నాయి. అలాంటప్పుడు ఉమ్మడి లక్ష్యసాధన సాధ్యమా?.

పిల్లా తిరుపతిరావు
7095184846

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News