హైదరాబాద్ : రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం (2023 – 24) నుంచి ఎంసెట్ ద్వారా బిఎస్‌సి నర్సింగ్ కోర్సుకు ప్రవేశాలు జరగనున్నాయి. ఎంసెట్‌లో బైపిసి విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు చేపట్టనున్నారు. బిఎస్‌సి నర్సింగ్‌ను ఎంసెట్‌లో చేర్చాలని కోరుతూ కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ కరుణాకర్‌రెడ్డి ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రికి లేఖ అందజేశారు. ఇప్పటివరకు నాలుగేళ్ల బిఎస్‌సి నర్సింగ్ కోర్సులో ప్రవేశాలను ఇంటర్ మార్కుల ఆధారంగా చేపడుతుండగా, ఇక నుంచి ఇంజినీరింగ్,ఫార్మసీ, మెడిసిన్ కోరుల తరహాలోనే నర్సింగ్ విద్యలోనూ ఎంసెట్ ర్యాంక్‌ల ద్వారానే సీట్ల భర్తీ కొనసాగుతుంది.
అందుబాటులో 5,300 సీట్లు
రాష్ట్రంలో బిఎస్‌సి నర్సింగ్ కోర్సులో మొత్తం 5,300 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 90 కాలేజీలు ఉండగా అందులో 9 ప్రభుత్వ కాలేజీల్లో 680 సీట్లు, 81 ప్రైవేట్ కాలేజీల్లో 4,680 ఉన్నాయి. 60 శాతం కన్వీనర్ కోటా భర్తీ చేయనుండగా, 40 సీట్లను యాజమాన్య కోటా విధానంలో భర్తీ చేయనున్నారు.
గతేడాదే నిర్ణయం…కౌన్సెలింగ్ సమయంలో మార్పు
ఎంసెట్ ద్వారా బిఎస్‌సి నర్సింగ్ ప్రవేశాలు చేపట్టాలని గతేడాది ఏప్రిల్‌లోనే కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం విజ్ఞప్తి మేరకు ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు దరఖాస్తు ప్రక్రియలో మార్పులు కూడా చేశారు. అయితే కౌన్సెలింగ్ సమయానికి పాత పద్దతిలో ఇంటర్ మార్కుల ఆధారంగా బిఎస్‌సి నర్సింగ్ ప్రవేశాలు చేపట్టనున్నట్లు కాళోజీ విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఆ మేరకు గత విద్యాసంవత్సరం ఇంటర్ మార్కుల ఆధారంగానే బిఎస్‌సి నర్సింగ్ కోర్సులో ప్రవేశాలు జరిగాయి. ప్రవేశ పరీక్ష ఆధారంగా నర్సింగ్ సీట్లు కేటాయించాలని భారతీయ నర్సింగ్ మండలి(ఐఎన్‌సి) చేసిన నిబంధనల మేరకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్ణయం తీసుకుంది.
Also Read: దారుణ ఘటన.. పట్టపగలే కాలేజీ విద్యార్థిని కాల్చివేత..
ఎంసెట్‌కు భారీగా దరఖాస్తులు
రాష్ట్రంలో ఇంజనీరింగ్,ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్‌కు ఈసారి భారీ సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు గడువు ఈ నెల 10వ తేదీతో ముగిసింది. అప్పటికే దరఖాస్తులు మూడు లక్షలు దాటాయి. గత ఏడాది ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగానికి కలిపి 2.66 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. ఈసారి దరఖాస్తు ఆలస్యం రుసుం లేకుండానే మూడు లక్షలకుపైగా దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం దరఖాస్తుల్లో అగ్రికల్చర్,ఫార్మసీ విభాగానికి సుమారు 1.10 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఇంజనీరింగ్ విభాగానికి సుమారు 1.95 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండింటికీ కలిపి 500 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు.
ఆలస్య రుసుంతో మే 2 వరకు ఛాన్స్
ఎంసెట్‌కు ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు మే 2వ తేదీ వరకు ఆలస్య రుసుంతో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. రూ.500 అపరాధ రుసుంతో ఈ నెల 20 వరకు, రూ.2,500 ఆలస్య రుసుంతో ఈ నెల 25వరకు, రూ.3 వేల ఆలస్య రుసుంతో మే 2వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. హాల్ టికెట్లను ఈ నెల 30 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 7 నుంచి 11 వరకు జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష తేదీల్లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇదివరకే తెలిపింది.
ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు పేర్కొంది. మే 7న నీట్ (యుజి) పరీక్ష, మే 7, 8, 9 తేదీల్లో టిఎస్‌పిఎస్‌సి పరీక్షలు ఉండటంతో ఈ మార్పులు చేశారు. ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులూ లేవని.. మే 10, 11 తేదీల్లోనే ఈ పరీక్షలు యథాతథంగా నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది.