Tuesday, November 26, 2024

మత సామరస్యాన్ని కాపాడింది టిడిపి: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎప్పుడు చూసినా మత ఘర్షణలతో కర్ఫ్యూ వాతావరణంతో ఉండే హైదరాబాద్‌లో మత సామరస్యాన్ని నిలిపిన ఖ్యాతి తెలుగుదేశానికి దక్కిందని అన్నారు. కర్ఫ్యూ సిటీని వ్యాక్సిన్ తయారు చేసే కేంద్రంగా హైదరాబాద్‌ను తయారు చేసింది తెలుగుదేశమని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ పాలనకు ముందు, తరువాత హైదరాబాద్‌ను చూడాలని కోరారు. తెలుగుదేశం హయాంలో 14 జిల్లాల్లో ఉర్దూను రెండో భాషగా అమలు చేసినట్లు ఆయన గుర్తు చేశారు.

అంతకు ముందు హజ్‌యాత్రకు ముస్లింలు వెళ్లాలంటే బొంబాయి వెళ్లాల్సి వచ్చేదని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో అసెంబ్లీకి ఎదురుగా హజ్‌హౌజ్‌ను నిర్మించి ఇక్కడి నుంచి హజ్‌కు వెళ్లటానికి డైరెక్ట్ ఫ్లైట్లు పెట్టామని చెప్పారు. కులీకుతుబ్‌షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని, ముస్లింలకు రెసిడెన్షియల్ స్కూల్స్, దుకాన్ మకాన్లు, షాదీఖానాలు ఏర్పాటు చేయడంతో పాటు మసీదులకు ఆర్థిక సహాయం వంటివి చేసినట్లు ఆయన గుర్తు చేశారు. అన్ని మతాలను, కులాలను అభివృద్ధి చేసింది టిడిపియే అని పేర్కొన్నారు. తెలుగుదేశం చేసిన అభివృద్ధి శాశ్వతమని, చరిత్ర ఉన్నంతవరకు తెలుగుదేశం చేసిన అభివృద్ధి నిలిచి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉన్న ముస్లింలందరికీ చంద్రబాబు నాయుడు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ పవిత్ర రంజాన్ మాసంలో మంచి పనులు చేసినవారికి అల్లా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని తెలంగాణ టిడిపి అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు బక్కని నర్సింహులు, కంభంపాటి రామ్మోహన్ రావు, బంటు వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు కాసాని వీరేశ్, ఆరీఫ్, అజ్మీర రాజునాయక్, బండారి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News