Sunday, November 24, 2024

హ్యాట్రిక్ విజయం ఎవరిదో?.. నేడు ఉప్పల్‌లో ముంబైతో సన్‌రైజర్స్ ఢీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇప్పటికే వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ముంబై ఇండియన్స్‌లు మంగళవారం ఉప్పల్‌లో జరిగే మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాలు అందుకోవాలనే పట్టుదలతో ఇరు జట్లు ఉన్నాయి. ఆరంభ మ్యాచుల్లో వరుస ఓటములు చవిచూసిన ముంబై, హైదరాబాద్‌లు ఆ తర్వాత వరుసగా రెండింటిలో విజయం సాధించాయి.

దీంతో ఉప్పల్ మ్యాచ్‌లో రెండు జట్లు కూడా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నాయి. సొంత గడ్డపై ఆడుతుండడం హైదరాబాద్‌కు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. హ్యారీ బ్రూక్ ఫామ్‌లోకి రావడం సన్‌రైజర్స్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. ఇక సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లు కిందటి మ్యాచ్‌లో రాణించడం ముంబైకి కలిసి వచ్చే అంశమే. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.

ఆశలన్నీ బ్రూక్‌పేనే..
ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఆశలన్నీ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్‌పై నిలిచాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రూక్ అజేయ శతకంతో అలరించాడు. ఈసారి కూడా అతనిపై సన్‌రైజర్స్ భారీ ఆశలు పెట్టుకుంది. మినీ వేలం పాటలో కళ్లు చెదిరే ధరను చెల్లించి సన్‌రైజర్స్ బ్రూక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్‌లో ఆడిన తొలి రెండు మ్యాచుల్లో బ్రూక్ ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బ్రూక్ కళ్లు చెదిరే శతకం సాధించి విమర్శకులకు గట్టి జవాబిచ్చాడు. ఈ మ్యాచ్‌లోనూ రాణించి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు.

కెప్టెన్ మార్‌క్రమ్ కూడా జోరుమీదుండడం హైదరాబాద్‌కు సానుకూల పరిణామం. ఈ మ్యాచ్‌లో కూడా చెలరేగాలనే లక్షంతో అతను ఉన్నాడు. అభిషేక్ శర్మ, క్లాసెన్‌లు కూడా కిందటి మ్యాచ్‌లో బ్యాట్‌ను ఝులిపించారు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే మయాంక్ అగర్వాల్ పేలవమైన ఫామ్ జట్టును కలవరానికి గురి చేస్తోంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ మయాంక్ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. రాహుల్ త్రిపాఠి కూడా తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోతున్నాడు. వీరు కూడా గాడిలో పడితే హైదరాబాద్‌కు తిరుగే ఉండదు.

ఆత్మవిశ్వాసంతో..
ఇక ముంబై ఇండియన్స్ కూడా ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. కిందటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తుగా ఓడించింది. దీంతో హైదరాబాద్ మ్యాచ్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ముంబైలో ఉన్నారు. వీరిలో ఏ ఇద్దరూ నిలదొక్కుకున్న జట్టు బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. గ్రీన్, జాన్‌సెన్, రిలీ మెరిడిత్, పియూష్ చావ్లా తదితరులతో ముంబై బౌలింగ్ కూడా బలంగానే ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో రోహిత్ సేనను కూడా తక్కువ అంచనా వేయలేం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News