న్యూఢిల్లీ : కొవిడ్ కేసులు మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ ఎక్స్‌బిబి1.16.1 కేసులు దాదాపు 436 వరకు బయటపడ్డాయని ఇండియన్ సార్స్ కొవి2 జినోమిక్స్ కన్సార్టియమ్ (ఇన్సాకాగ్) సోమవారం వెల్లడించింది. ఒమిక్రాన్‌కు చెందిన ఈ వేరియంట్ గత జనవరిలో రెండు శాంపిల్స్ పరీక్షిస్తున్నప్పుడు బయటపడింది. అయితే ఇప్పటివరకు మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, హర్యానా తదితర 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 436 కేసులు బయటపడ్డాయని, ఇన్సాకాగ్ వెల్లడించింది. అయితే ఇన్సాకాగ్ డేటా ప్రకారం మొత్తం 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎక్స్‌బిబి1.16 వేరియంట్ కేసులు మొత్తం 2735 బయటపడ్డాయి. ఇక కరోనా వైరస్ కేసులకు సంబంధించి గత 24 గంటల్లో 9111 కొత్త కేసులు బయటపడగా, యాక్టివ్ కేసులు 60,313 వరకు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
Read Also: హ్యాట్రిక్ విజయం ఎవరిదో?.. నేడు ఉప్పల్‌లో ముంబైతో సన్‌రైజర్స్ ఢీ..
24 గంటల వ్యవధిలో గుజరాత్‌లో ఆరుగురు, ఉత్తరప్రదేశ్, కేరళలో నలుగురు వంతున, ఢిల్లీ, రాజస్తాన్‌లో ముగ్గురు వంతున, మహారాష్ట్రలో ఇద్దరు, బీహార్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ , తమిళనాడులో ఒక్కొక్కరు వంతున మొత్తం 27 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్ మృతుల సంఖ్య మొత్తం 5, 31, 141 కి పెరిగింది. దేశంలో పశ్చిమ, దక్షిణ, ఉత్తరాది ప్రాంతాల్లో ఇన్‌ఫెక్షన్ రేటు పెరిగినట్టు తెలిసిందని మార్చి 27నాటి ఇన్సాకాగ్ బులెటిన్ పేర్కొంది. మార్చి మూడో వారం వరకు సేకరించిన నమూనాల బట్టి ఎక్స్‌బిబి వేరియంట్ కొనసాగుతున్నట్టు నిర్ధారణ అయిందని వివరించింది. దేశం మొత్తం మీద పర్యవేక్షించే కేంద్రాల నుంచి, దేశానికి వచ్చిన విదేశీయుల నుంచి సేకరించిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయడమవుతోందని పేర్కొంది.