న్యూయార్క్ : కృత్రిమ మేధపై గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఎఐ) వల్ల కలిగే దుష్ప్రభావాలను తలచుకుంటే నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోందని ఆయన అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎఐ సాంకేతికత హానికరమైందని, దీనిని సరిగ్గా వినియోగించపోతే భవిష్యత్‌లో పెనుముప్పు తలెత్తే అవకాశముందని హెచ్చరించారు. టెక్నాలజీలో ప్రతికూలత ఎక్కువగా ఉంటే అది ప్రమాదకరంగా మారే అవకాశముందని, దీనిని సరైన విధంగా వినియోగించేందుకు ప్రభుత్వాలు తక్షణమే కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
సిబిఎస్‌తో ఇంటర్వూలో పిచాయ్ మాట్లాడుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో చెడు ప్రభావాలను తలచుకుంటే నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని, ‘ఎఐని సరైన మార్గంలో వినియోగించాలి. ఎఐని తప్పుగా వినియోగిస్తే ఎంతో ప్రమాదకరం’ అని అన్నారు. ప్రతికూల పరిమాణాలు తలెత్తకుండా నివారించాల్సిన అవసరం ఉందని, అయితే ఎఐని పరిచయం చేసేందుకు కంపెనీలు పోటీపడుతున్నాయని పేర్కొన్నారు. చాట్ జిపిటిని రూపొందించిన ఓపెన్ ఎఐ గురించి ప్రశ్నించగా పిచాయ్ కంపెనీని ప్రత్యక్షంగా విమర్శించకుండా పలు వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి శక్తివంతమైన సాంకేతికతను స్వీకరించడానికి సమాజానికి సమయం లేకుండా విడుదల చేయడం పట్ల ఇతరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.