ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులను మోసం చేసిన మోడీ
బండి మాటలు వింటే నవ్వాలో.. ఏడవాలో అర్థం కావడం లేదు
ఈ నెల 21, 24, 26 తేదీల్లో నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో నిరుద్యోగ నిరసన దీక్షలు
మే 4 లేదా 5 తేదీల్లో భారీ బహిరంగ సభ.. ముఖ్య అతిథిగా ప్రియాంకగాంధీ హాజరు
మే 9 నుంచి రెండో విడత హాత్ సే హాత్ జోడో: పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి
హైదరాబాద్: ప్రతీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న ప్రధాని నరేంద్ర మోడీ నిరుద్యోగులను మోసం చేశారని టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. 22 కోట్ల 6 లక్షల దరఖాస్తులు వస్తే 7,22, 311ఉద్యోగాలు ఇచ్చామని పార్లమెంట్ సాక్షిగా ప్రధాని సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. అంతే కాకుండా నిండు పార్లమెంటులోనే నిరు ద్యోగులను మోసం చేసినట్లు ప్రధాని అంగీకరించారని తెలిపారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే ఒకే రోజులో 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని బండి సంజయ్ చెబుతున్నాడని, బండి సంజయ్ మాటలు వింటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదన్నారు.
Also Read: ధరణి తెచ్చింది.. ప్రభుత్వభూముల ఆక్రమణకేనా?: రఘునందన్
హైదరాబాద్ వరదల సమయంలో బండి పోతే బండి ఇస్తామన్నారు. ఆ తరువాత ఇన్సూరెన్స్ ఉంది కదా అన్నారు. అసలు ఏ శాఖలో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో బండికి తెలుసా? అని రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ప్రజాక్షేత్రం నుంచి పార్లమెంట్ వరకు నిరుద్యోగుల కోసం కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్ వరంగల్ లో కాకుండా మోడీ ఇంటి దగ్గర చేసి ఉండి ఉంటే బాగుండేదని చమత్కరించారు.
Also Read: ఫోటో గ్రాఫర్లకు బీమా: మంత్రి జగదీష్ రెడ్డి
ఈ నెల 21న నల్గొండలో మాహాత్మా గాంధీ యూనివర్సిటీలో నిరుద్యోగ నిరసన దీక్ష చేపడతామన్నారు. విద్యార్ధుల భవితకు అండగా ఉంటామని తెలిపారు. అంతే కాకుండా ఈ నెల 24న ఖమ్మం జిల్లాలో, 26న ఆదిలాబాద్‌లో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. మే 4 లేదా 5న సరూర్‌నగర్‌లో నిరుద్యోగుల సమస్యలపై భారీ సభ నిర్వహించ బోతున్నట్టు వివరించారు. ఎల్బీనగర్ లోని శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులు అర్పించి, సభా ప్రాంగణానికి ర్యాలీగా వెళతామన్నారు. ఇక ఇదే సభకు ప్రియాంక గాంధీ ముఖ్య అతిధిగా పాల్గొంటారన్నారు.
ఇది కాంగ్రెస్ పార్టీ సొంత ప్రయోజనాల కోసం కాదని, నిరుద్యోగుల కోసం చేస్తు న్న పోరాటమని స్పష్టం చేసారు. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఈ దీక్షలకు అన్ని నిరుద్యోగ సంఘాలు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. మే 9 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర రెండో విడత కార్యక్రమం ఉంటుందని, జోగులాంబ జిల్లా నుంచి యాత్ర ప్రారంభమవుతుందన్నారు రేవంత్ రెడ్డి స్పష్టీకరించారు.