కోల్‌కత: బిజెపి పశ్చిమ బెంగాల్‌కు చెందిన సీనియర్ నాయకుడు ముకుల్ రాయ్ తిరిగి బిజెపి గూటికి వెళ్లాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయగా తన తండ్రికి వైద్య చికిత్స అవసరమంటూ ఆయన కుమారుడు సుభరంగ్సు వెల్లడించారు. ముకుల్ రాయ్ మంగళవారం ఢిల్లీలో చేసిన ప్రకటనై ఆయన కుమారుడు బుధవారం కోల్‌కతాలో విలేకరులతో మాట్లాడుతూ తన తండ్రి మాటలను సీరియస్‌గా పట్టించుకోరాదని చెప్పారు. తన తండ్రి మాటలను తాను విన్నానని, ఆయనకు వైద్య చికిత్స అవసరమని శుభ్రాంగ్సు అన్నారు. తన తండ్రికి శారీరక, మానసిక సమస్యలు ఉన్నాయని ఆయన చెప్పారు. తన తండ్రిని అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకునే వారు సిగ్గుపడాలని మాజీ ఎమ్మెల్యే అయిన శుభరంగ్సు వ్యాఖ్యానించారు. తన తండ్రికి ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదని, ఆయన డమెమన్షియా, పార్కిన్‌సన్ వ్యాధులతో బాధపడుతున్నారని శుభరంగ్సు తెలిపారు.
కృష్ణానగర్ ఉత్తర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముకుల్ రాయ్ 2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తన కుమారుడితో కలసి టిఎంసిలో చేరారు. పోల్ మేనేజ్‌మెంట్‌లో దిట్టగా పేరు పొందిన ముకుల్ రాయ్ 2017లో బిజెపిలో చేరి 2019 లోక్‌సభ ఎన్నికలలో బెంగాల్‌లో ఆ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు.
టిఎంసిలో చేరిన నాటి నుంచి ఆయన తెరమరుగై పోయారు. అనారోగ్య సమస్యలతో ఆయన పలుమార్లు ఆసుపత్రి పాలయ్యారు.
సోమవారం సాయంత్రం ఎవరికీ చెప్పకుండా ముకుల్ రాయ్ ఢిల్లీకి వెళ్లిపోవడంతో ఆయన కుమారుడు ఆందోళన చెంది తన తండ్రి కనపడడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ముకుల్ రాయ్ ఒక వెంగాలీ పత్రిక విలేకరితో మాట్లాడుతూ తాను తిరిగి బిజెపిలో చేరాలని భావిస్తున్నానని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాను కలుసుకుంటానని చెప్పారు. తన కుమారుడు కూడా తనతోపాటే బిజెపిలోకి రావాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. అయితే..తనతండ్రి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలపై శుభరంగ్సు స్పందిస్తూ తాను ఇఎంసి అధినేత్రి మమతా బెనర్జీకి విధేయుడైన సైనికుడినని, తాను టిఎంసిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. దీనిపై వ్యాఖ్యానించడానికి టిఎంసి నిరాకరించింది.
ఇదిలా ఉండగా..ముకుల్ రాయ్‌ను తిరిగి బిజెపిలో చేర్చుకునే అవకాశాలు లేవని బిజెపి నాయకుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన సువేందు అధికారి తెలిపారు. అటువంటి వారిని పార్టీలో చేర్చుకోవాలన్న ఆసక్తి లేదని, బూత్ స్థాయి నుంచి బిజెపిని బలోపేతం చేయడంపైనే తమ దృష్టంతా ఉందని ఆయన చెప్పారు.