బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ యువమోర్చా నేత ప్రవీణ్ కుమార్ దారుణ హత్యకు గురయ్యారు. దార్వాడ్ జిల్లా కొట్టూరు గ్రామ పంచాయతీలో ఈ ఘటన జరిగింది. మంగళవారం రాత్రి ఓ ఆలయం వద్ద ఊరేగింపులో రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణను ఆపడానికి ప్రవీణ్ ప్రయత్నించగా ప్రత్యర్థులు ఆయనను కత్తులతో పొడిచి హత్య చేశారు. వెంటనే ఎస్‌డిఎం ఆస్పత్రికి తరలించగా, బుధవారం ఉదయం 5 గంటలకు ఆయన చనిపోయారని కర్ణాటక శాంతి భద్రతల ఏడీజీపీ అలోక్ కుమార్ తెలిపారు.
ఈ హత్యకు సంబంధించి నలుగురిని అరెస్టు చేశామని చెప్పారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ప్రవీణ్ వర్గంతో గొడవపడిన వర్గం తాగిన మత్తులో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు బెంగళూరు సౌత్ ఎంపీ తేసజ్వీ సూర్య ఆరోపించారు. ప్రత్యర్థి వర్గం కుట్రతో ఈ హత్యకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. పోలీసులు మాత్రం ఇందులో రాజకీయం ఏదీ లేదని, కేవలం ఊరేగింపులో జరిగిన గొడవలే కారణమని పేర్కొన్నారు.