స్కూల్ దుస్థితిని వీడియో ద్వారా మోడీకి చూపించిన చిన్నారి సీరత్ నాజ్
శ్రీనగర్ : “ఇదీ మా స్కూల్.. కూర్చోడానికి కుర్చీలు లేవు. నేలపైనే కూర్చుంటున్నాం. మా యూనిఫాంకు మట్టి అంటుకుంటోంది. మా అమ్మానాన్న తిడుతున్నారు. టాయిలెట్ చూడండి. ఎంత ఘోరంగా ఉందో.. గత ఐదేళ్ల నుంచీ ఇదే పరిస్థితి. కనీసం మీరైనా మా స్కూలును బాగు చేయించండి.
మాకు మంచి స్కూలు కట్టిస్తే మేం బాగా చదువుకోగలం.ప్లీజ్ ఆ సాయం చేయండి ” అంటూ చిన్నారి సీరత్ నాజ్ తన ముద్దుముద్దు మాటలతో స్కూలు దుస్థితిని వీడియో ద్వారా కళ్లకు కట్టినట్టు ప్రధాని మోడీకి వివరించి విన్నవించడం ఫలితం ఇచ్చింది. ఐదు నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియో వైరల్ కావడంతో అధికారుల్లో కదలిక వచ్చింది.
ఆ పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించడానికి పనులు ప్రారంభించారు. జమ్ము కశ్మీర్ లోని కధువా జిల్లా లోహైమల్హార్ బ్లాక్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలలో సీరత్ నాజ్ చదువుతోంది. ఈ నెల 14న ఆ పాఠశాల దుస్థితిని చూపిస్తూ వీడియోను రికార్డు చేసి మోడీకి చూపించింది. దీంతో జమ్ము స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రవిశంకర్ శర్మ లోహైమల్హార్ లో ఉన్న ఆ స్కూలును సందర్శించి స్కూలు పనుల గురించి అధికారులతో చర్చించారు.
ఆ స్కూలులో ఆధునిక వసతులు కల్పించడానికి రూ.91 లక్షలు విడుదల చేశామని చెప్పారు. జమ్ము ప్రావిన్స్ లోని అన్ని జిల్లాల్లో వెయ్యి కిండర్ గార్డెన్లను నిర్మిస్తున్నామని, వచ్చే నాలుగేళ్లలో ప్రతి జిల్లాలో 250 చొప్పున ఏర్పాటు చేస్తామని తెలిపారు.