రాయ్‌పూర్: పెళ్లి మండపంలో వధువు, వరుడిపై యాసిడ్ దాడి చేయడంతో మరో పది మంది బంధువులు గాయపడిన సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. చోట్ అంబాలా గ్రామంలో సునీత కశ్యప్(19), దామ్రుధర్ బాఘెల్(25),అనే యువతి, యువకుడు పెళ్లి చేసుకుంటున్నారు. వధువు ఇంట్లోనే పెళ్లి జరుగుతుండడంతో బంధువులు, స్నేహితులు పెళ్లి మండపానికి చేరుకున్నారు. వివాహం జరుగుతుండగా కరెంట్ పోవడంతో గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్‌తో వరుడు-వధువు దాడి చేశాడు.
Also Read: ప్రపంచంలో టాప్ 10 సంపన్న నగరాలు ఇవే.. భారత్‌కు దక్కని చోటు
ఈ దాడిలో వధువు, వరుడు, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో వధువు, వరుడు, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో మెరుగైన చికిత్స నిమిత్తం జగ్ధల్‌పూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆ వివాహానికి నారాయణ్‌పూర్ కాంగ్రెస్ ఎంఎల్‌ఎ చందన్ కశ్యప్ కూడా హాజరయ్యారు. వధువు, వరుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భాన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.