మన తెలంగాణ/దామెర: రైతులకు అండగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిలుస్తుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గత ఏడాది జనవరిలో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెక్కులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రైతులకు అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ఏడాది వడగండ్ల వానకు నియోజకవర్గంలో 6322 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని 6043 మంది రైతులకు గాను రూ. 3.03 కోట్లకు పైగా నష్టపరిహారం కింద ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు.
వచ్చే వారం నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు. రైతుల కష్టాలు, సమస్యలు తీర్చేందుకు రైతు బంధు సమితిలను ఏర్పాటుచేసి ఐదు వేల ఎకరాలకు ఒక సెక్టార్ ఏర్పాటుచేసి రైతు వేదికలు నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. దామెర మండలంలో జనవరి 2022లో దెబ్బతిన్న మిర్చి పంటకు 440 రైతులకు 270 ఎకరాలకు రూ. 14.16 లక్షలు, మొక్కజొన్నకు 437 రైతులకు 538 ఎకరాలకు రూ. 18.93 లక్షల చెక్కులను రైతులకు అందించినట్లు తెలిపారు.