న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ శనివారం కొద్ది సేపు ఆర్‌కె పురా పోలీసు స్టేషన్ వద్ధ భైఠాయించారు. ముందస్తు అనుమతి లేకుండానే మాలిక్ స్థానిక ఆర్‌కె పురం ఏరియాలో ఓ పార్క్‌లో సమావేశం ఏర్పాటు చేశారని, దీనిపై తాము ఈ జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్‌ను ప్రశ్నించామని పోలీసులు తెలిపారు. సత్యపాల్ మాలిక్ తన మద్దతుదార్లతో కలిసి వచ్చి పోలీసు స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు.
పోలీసులు తనను అదుపులోకి తీసుకుని వదిలిపెట్టారని, తానేం నేరం చేశారని ప్రశ్నించేందుకు వచ్చానని చెపుతూ పోలీసు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఓ అవినీతి కేసులో ఒక్కరోజు క్రితమే సిబిఐ నుంచి మాలిక్‌కు సమన్లు వెలువడ్డాయి. మాలిక్ ధర్నాపై పోలీసులు స్పందించారు. ఆయనను ఎక్కడా నిర్బంధంలోకి తీసుకోలేదని, కేవలం కొన్ని ప్రశ్నలు వేశామని తెలిపారు. ఆయనే తన మద్దతుదార్లతో కలిసి ఆర్‌కె పురా ఠాణా వద్దకు వచ్చి ధర్నాకు దిగారని , ఆయన ఎంతసేపైనా అక్కడ కూర్చోవచ్చునని ,ఈ స్వేచ్ఛ ఆయనకు ఉందని తెలియచేశామని పోలీసు అధికారులు వివరించారు.