న్యూఢిల్లీ: జమ్మూ, కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ముఖ్యంగా జమ్మూ, కశ్మీర్ విషయంలో అది వ్యవహరించిన తీరుపై చేసిన ఆరోపణలో ్లవిశ్వసనీయత ఎంతో తెలుసుకోవలసిన అవసరం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.‘ బిజెపి దాచిపెట్టాల్సినదేమీ చేయలేదు. ఈ అంశాన్ని బహిరంగంగా చర్చించి ఉండాల్సింది కాదు. అవకతవకలకు సంబంధించి ఆయనకు సమాచారం ఉన్నట్లయితే తన పదవీ కాలంలోనే ఆయన మాట్లాడి ఉండాల్సింది. ఆయన ఇప్పుడు ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు? దీన్నిబట్టి ఆయన ఆరోపణల్లో విశ్వసనీయత ఎంతో అర్థమవుతుంది’ అని శనివారం ఓ టీవీ న్యూస్ చానల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అమిత్ షా అన్నారు.
కేంద్రప్రభుత్వ ఉదాసీన వైఖరి కారణంగానే పుల్వామా దుర్ఘటన చోటు చేసుకుందని, బలగాలను విమానాల ద్వారా తరలించడానికి ఆర్మీకి కేంద్రం అనుమతి నిరాకరించిందని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వూలో మాలిక్ ఆరోపించిన విషయం తెలిసిందే. మాలిక్ ఆరోపణల తర్వాత ఆయనకు సిబిఐ సమన్లు జారీ చేయడం గురించి అమిత్ షా మాట్లాడుతూ, ‘సిబిఐ ఆయనను పిలవడం ఇది మొదటిసారి కాదు, ఇన్సూరెన్స్ స్కామ్‌కు సంబంధించి ఆయనపై ఆయనపై సిబిఐ విచారణ జరుగుతోంది. సిబిఐ తన డ్యూటీ మాత్రమే చేస్తోంది. సిబిఐ సమన్లకు, ఆయన ఆరోపణలకు మధ్య ఎలాంటి సంబంధం లేదు’ అని అన్నారు.