ముంబై : జనాభాలో భారత దేశం చైనాకు వెనక్కు నెట్టేసి 142 కోట్లకు చేరిందని, ఈ నేపథ్యంలో ఈసారి ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లలున్న ఎంపీలు, ఎమ్‌ఎల్‌ఎలపై అనర్హత వేటు వేయాలని, అలాంటి వారికి ప్రభుత్వం తరఫున ఎలాంటి రాయితీలు ఇవ్వకూడదని ఎన్‌సిపీ సీనియర్ నేత అజిత్ పవార్ ఆందోళన వ్యక్తం చేశారు. బారామతిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అజిత్ పవార్ మాట్లాడారు. అలా చేస్తే ప్రజల్లో అధిక జనాభా సమస్యపై మరింత అవగాహన పెరుగుతుందన్నారు.
మనదేశం బాగుండాలంటే ఒకరిద్దరు పిల్లలకే మనం పరిమితం కావాలన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లల నిబంధన ఉండగా, ఎంపీలు, ఎమ్‌ఎల్‌ఎలుకు ఎందుకు ఈ నిబంధన వర్తింప చేయకూడదని ప్రజలు ప్రశ్నిస్తున్నారని, అయితే ఈ నిర్ణయం కేంద్రం చేతుల్లో ఉందని, అందువల్ల కేంద్రమే ఈ చర్యలు తీసుకోవాలన్నదే తమ డిమాండ్‌గా ఆయన పేర్కొన్నారు.