Monday, December 23, 2024

గ్యాంగ్‌స్టర్ ఆనంద్ మోహన్ సింగ్‌కు జైలు నుంచి విముక్తి.. హతుని భార్య ఆవేదన..

- Advertisement -
- Advertisement -

పాట్నా: ఐఎఎస్ అధికారిని హతమార్చిన కేసులో గత 14 ఏళ్లుగా బీహార్ లోని సహర్షా జైలులో శిక్ష అనుభవిస్తున్న రాజకీయ నాయకుడిగా మారిన గ్యాంగ్‌స్టర్ ఆనంద్ మోహన్ సింగ్ విడుదలకు మార్గం సుగమం అయింది. జైలు మాన్యువల్ నిబంధనల్లో మార్పులు జరిగిన కొద్ది రోజులకే ఆనంద్ మోహన్‌తోపాటు మరో 26 మంది ఖైదీల విడుదలకు ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. 1994 డిసెంబర్ 5న ముజఫర్‌పూర్‌లో ఐఎఎస్ అధికారి జి. కృష్ణయ్యను కారు నుంచి బయటకు లాగి రాళ్లతో తీవ్రంగా కొట్టారు.

ఈ మూకుమ్మడి దాడిలో కృష్ణయ్య అక్కడికక్కడే చనిపోయారు. మాజీ ఎంపి అయిన ఆనంద్ మోహన్ సింగ్ ఈ హత్యకేసులోనే జైలు శిక్ష అనుభవిస్తున్నారు. బీహార్ జైలు మాన్యువల్ లో “విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల హత్య కేసులకు రెమిషన్ మంజూరు చేయకూడదన్న” “క్లాజ్”ను నితీశ్ కుమార్ ప్రభుత్వం ఏప్రిల్ 10న సవరించింది.దీంతో ఇలాంటి కేసుల్లో యావజ్జీవ శిక్ష పొందుతున్న దోషులకు శిక్షాకాలం తగ్గించే వీలు కలుగుతోంది. ఈమేరకు 27 మంది ఖైదీల విడుదలకు నితీశ్ ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.

ఏప్రిల్ 20న బీహార్ రాష్ట్ర సెంటెన్స్ రెమిషన్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు నోటిఫికేషన్ పేర్కొంది. ఎవరైతే 14 ఏళ్లు లేదా 20 ఏళ్లు శిక్ష అనుభవించారో వారికి రెమిషన్ వర్తిస్తుందని వివరించింది. 1994లో లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్యాంగ్‌స్టర్ , బీహార్ పీపుల్స్ పార్టీ (బీపీపీ )నాయకుడు ఛోటన్ శుక్లాను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దీంతో బీపీపీ వ్యవస్థాపకుడు ఆనంద్ మోహన్ ప్రేరేపణతో వేలాది మంది కార్యకర్తలు అల్లర్లకు పాల్పడ్డారు. ఛోటన్ అంతిమయాత్ర సమయంలో గోపాల్ గంజ్ జిల్లా మేజిస్ట్రేట్‌గా ఉన్న ఐఎఎస్ అధికారి జి. కృష్ణయ్య(35)పై మూకుమ్మడి దాడి జరిగింది. కారు నుంచి కృష్ణయ్యను బయటకు లాగి రాళ్లతో తీవ్రంగా కొట్టడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ఆనంద్ మోహన్ సింగ్‌కు బీహార్ దిగువ కోర్టు 2007లో మరణశిక్ష విధించింది. 2008లో పాట్నా హైకోర్టు ఈ శిక్షను జీవితఖైదుగా మార్చింది. సుప్రీం కోర్టు కూడా ఈ తీర్పును సమర్ధించింది.

ఇది హంతకులను ప్రోత్సహించడమే: హతుని భార్య ఉమా కృష్ణయ్య ఆవేదన
ఈ సంఘటనలో హతుడు కృష్ణయ్య తెలంగాణ లోని మహబూబ్ నగర్‌కు చెందిన దళిత బ్యూరోక్రాట్ . హత్యకు పాల్పడి జైలుశిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ ఆనంద్ మోహన్ సింగ్‌కు బీహార్ ప్రభుత్వం విడుదలకు వీలు కల్పించడాన్ని హతుడు కృష్ణయ్య భార్య ఉమా కృష్ణయ్య తీవ్రంగా ప్రతిస్పందించారు. నేరస్తుడు ఆనంద్ సింగ్ మోహన్‌ను ఉరితీసినా ప్రజలు భయపడరని వ్యాఖ్యానించారు. బీహార్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సమాజంలో తప్పుడు సంకేతాలను పంపిస్తోందని ఆమె విమర్శించారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోడీ జోక్యం చేసుకుని, నిర్ణయం వెనక్కు తీసుకోవాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కు సూచించాలని ఆమె అభ్యర్థించారు.

ఇది మంచి నిర్ణయం కాదన్నారు. అంతకు ముందు నేరస్తునికి జీవితఖైదు విధించినా తమకు ఏమాత్రం సంతోషం కలగలేదని, ఇప్పుడు విడుదల అవుతుండడం , రాజకీయాల్లోకి రావాలనుకోవడం చూస్తుంటే హంతకులను ప్రోత్సహించడమే అని ఆమె పేర్కొన్నారు.నేరం చేసి జైలుకు వెళ్లవచ్చని, విడుదలై రాజకీయాల్లోకి చేరవచ్చన్న తప్పుడు సంకేతాలు సమాజం లోకి పంపినట్టు అవుతుందని ఆమె విమర్శించారు. ఆ నేరస్తునికి మరణ శిక్షే మంచిదని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News