మన తెలంగాణ/సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్‌కు సమ ఉజ్జీలైన నాయకులే లేరని, తాము నాయకులమని చెప్పుకుంటున్న వారు ఆయన కాలిగోటికి కూడా సరిపోరని, అధికారం కోసం అంగలార్చుతున్న గుంట నక్కల పట్ల జాగ్రత్తగా ఉండాలని బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కెటిఆర్ అన్నారు. మంగళవారం సిరిసిల్ల నియోజక వర్గ బిఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశంలో మంత్రి కెటిఆర్ మాట్లాడారు. పెండపై రాయేస్తే అది మనపైనే చిల్లుతుందని అందువల్ల ప్రతిపక్ష నేతల గురించి తాను ఎక్కువ గా మాట్లాడనన్నారు. రాష్ట్రంలో ఒక పార్టీకి బ్రెయిన్‌లేని బంటీ నాయకత్వం వహిస్తుంటే మరో పార్టీకి పార్టీలు మా రే సంటి నాయకత్వం వహిస్తున్నాడని ఇట్లాంటి వారు మా కు పోటా అని ఆయన ప్రశ్నించారు. దేశమంతా సిఎం కెసిఆర్ విధానాలను ఆమోదిస్తోందన్నారు. తమ పక్క రాష్ట్రా లు కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నాయన్నారు. అభివృద్ధే తమ కులమని, సంక్షేమమే తమ మతమని, జనహితమే తమ ధ్యేయమని ఆయన అన్నారు.
బిజెపి గత ఎన్నికల్లో గుజరాత్‌లో జరగని అభివృద్ధి జరిగినట్లుగా గోల్‌మాల్ గుజరాత్‌ను చూపి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిందని తాము ఇప్పుడు గోల్డెన్ తెలంగాణ నమూనాను దేశ ప్రజలకు చూపి జాతీయ స్థాయి ఎన్నిక ల్లో పోరాటం చేస్తామన్నారు. సిఎం కెసిఆర్ సభలకు ఔరంగాబాద్‌లో, నాందేడ్‌లో, లోహలో ప్రజలు బ్రహ్మరథం ప ట్టారని, అబ్‌కి బార్ కిసాన్ సర్కార్ అని ప్రజలు, రైతులు నినదిస్తున్నారన్నారు. రెండు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి నాలుగున్నర లక్షల కోట్లు ఖర్చుచేస్తే 45 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న కేంద్రం రైతుల కోసం ఏమి చేసిందని మంత్రి కెటిఆర్ నిలదీశారు. చారిత్రిక అనివార్యతతో సిఎం కెసిఆర్ దేశ రాజకీయాల్లోకి వెలుతున్నారని, జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌లను ప్రజలు, రైతులు బండకేసి కొట్టడానికి సిద్ధ్దంగా ఉన్నారన్నారు. బిఆర్‌ఎస్ శ్రేణులు ఆదమర్చి ఉండవద్దని ఆదమరిస్తే పచ్చని ఇంట్లో పాము సొచ్చినట్లే చేస్తారని అన్నారు.
గత ఎన్నికల్లో సిరిసిల్ల నియోజక వర్గంలో తనను 89 వేల ఓట్ల ఆధిక్యతతో గెలిపించిన కార్యకర్తలు కొద్దిగా ఆదమరవడంతో, సేద తీరడంతో ఎంపి ఎన్నికల్లో తమ అభ్యర్థి బోయినిపెల్లి వినోద్‌కుమార్ లాంటి మంచి నాయకుడు ఓటమి పాలయ్యాడన్నారు. అందువల్ల ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి వచ్చే ఎన్నికల్లో మరింత అప్రమత్తంగా ఉండి ప్రతిపక్షనాయకులుగా ఉన్నవారిని వారి స్వంత నియోజక వర్గాల్లోనే మట్టికరిపించాలన్నారు. సిరిసిల్ల నియోజక వర్గం మెజార్టీతోనే మన ఎంపి అభ్యర్థి గెలవాలన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి సిఎం కెసిఆర్ దేశంలో ఎక్కడా లేని పథకాలు అమలు పరుస్తున్నారని పేరుపేరున వివరించారు. 125 అడుగుల ఎత్తైన డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహన్ని ఆవిష్కరించుకోవడం వల్ల, కొత్త సెక్రటేరియట్‌కు డా. బిఆర్ అంబేద్కర్ నామకరణం చేయడం వల్ల దేశవ్యాప్తంగా అంబేద్కరిస్టులు సిఎం కెసిఆర్‌ను, బిఆర్‌ఎస్‌ను అభినందిస్తున్నారన్నారు. 119 నియోజక వర్గాల్లో మంగళవారం (ఈ రోజు) బిఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామన్నారు.
తమ పార్టీ పేరు టిఆర్‌ఎస్ నుండి బిఆర్‌ఎస్‌గా మారిందే గాని తమ పార్టీ డిఎన్‌ఎ, రంగు, రుచి, ఎజెండా, ఎన్నికల గుర్తు ఇలా ఏదీ మారలేదని గుర్తు చేశారు. దేశ జనాభాలో రెండున్నర శాతమున్న తెలంగాణ వాసులు జాతీయ స్థాయిలో స్వచ్ఛతలో 30 శాతం (13 గ్రామపంచాయతీలు) జాతీయ అవార్డులు సాధించామన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో సిరిసిల్ల జడ్‌పి, మున్సిపల్ లో జాతీయ స్థాయిలో అవార్డులు సాధించాయన్నారు. సిరిసిల్ల ప్రాంతం అనేక రంగాల్లో అభివృద్ధ్ధి సాధించిందన్నారు. తెలంగాణ ఉద్యమ ప్రారంభ కాలం నాటి పరిస్థితులను మంత్రి కెటిఆర్ వివరించారు. కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహనికి పూలమాల సమర్పించి నమస్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి దేశపతి శ్రీనివాస్, నాఫ్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, పవర్‌లూమ్ టెక్స్‌టైల్ కార్పోరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, గడ్డం నర్సయ్య, ఆకునూరి శంకరయ్య, జిందం కళచక్రపాణి, తోట ఆగయ్య, జిందం చక్రపాణితో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.