Saturday, November 23, 2024

హేతుబద్ధత లేని దేశాల్లో భారత్ ఫస్ట్!

- Advertisement -
- Advertisement -

ఇటీవల ఒకాయన గోడ మీది కేలండర్‌లోని దేవుని చిత్రానికి పాలు తాగించాడట. కేలండర్ అంటే పేపర్. పేపర్ పాలను పీల్చుకుంటుంది కదా? కేలండర్‌లు గుడ్డతో కూడా తయారవుతుంటాయి. అది గనుక గుడ్డ కేలండర్ అయి వుంటే తప్పకుండా పాలు పీల్చుకుంటుంది. అలాగే ఇటుకల క్కూడా పాలు తాగించొచ్చు. రోడ్డు మీద పడి వున్న రాయికీ తాగించొచ్చు. అంటే అలా పీల్చుకోవడం వాటి ప్రాథమిక లక్షణం! అదే మనం విగ్రహాలలో చూస్తున్నాం. తప్పితే, విగ్రహాలకు మహిమ వున్నట్టు కాదు. అలా మహిమలు ఉన్నట్టు ప్రకటించడమంటే, అది అజ్ఞానమైనా కావాలి లేదా ప్రజలను మోసగించేందుకు ఉద్దేశ పూర్వకంగా పన్నిన పన్నాగమైనా కావాలి. “ఏ నిరూపణకూ అందనిదే మహిమ” అని కొందరు భక్తులు నిర్వచిస్తున్నారు.

దేవుడి మీద అచంచల విశ్వాసం వుండి, ప్రతి దాంట్లోనూ దైవాన్ని చూసే జనం ప్రకృతి ధర్మాల్ని అర్థం చేసుకోరు. శాస్త్ర వివరణలను అర్థం చేసుకునే ప్రయత్నమూ చేయరు. రోజూ పాలు తాగని విగ్రహాలు అప్పుడప్పుడు మాత్రమే ఎందుకు తాగుతున్నాయీ? ఏదో కొద్ది మంది విగ్రహాలకు పాలు తాగించి, దానికి విస్తృత ప్రచారం ఎందుకిస్తున్నారు? అలా చేయడం వల్ల ఎవరికి లాభం? అనే విషయాలు ఆలోచిస్తే చాలా సులభంగా సమాధానాలు దొరుకుతాయి. అందులో అర్థం కాని, గొప్ప గొప్ప విషయాలు ఏవీ లేవు. జనం హేతుబద్ధంగా ఆలోచించడం ఎక్కువైంది. పైగా దైనందిన యాంత్రిక జీవితం ఏవో కొన్ని పండుగలు, పర్వదినాలల్లో తప్ప, రోజూ గుడికి వెళ్ళి అర్చనలు చేయించి, హారతులిచ్చి, దేవుడికి భారీగా కానుకలు సమర్పించే జనం తక్కువవుతున్నారు. ఆలయ ఆదాయం మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారు.

విపరీతంగా పెరుగుతున్న ధరల కారణంగా వీరి బతుకులు, దుర్భరమవుతున్నాయి. అలాంటప్పుడు ఎవరో కొద్ది మంది ఇలాంటి వదంతులను వ్యాపింప జేసి, ప్రజల్లో మూఢత్వాన్ని పెంచుతున్నారు. ఏదో ఒక సంచలనం సృష్టిస్తే గాని, జనం దృష్టి పడదు. జనం దృష్టి పడితే గాని, దేవుణ్ణి మొక్కుతూ వెళ్ళకి రారు. “దేవుడి మహిమ” అనే ఒక విస్మయం, ఒక అద్భుతం, ఒక భయం కల్పిస్తే గాని, వారు దేవుడి హుండీలో నాలుగు డబ్బులు రాల్చరు. హుండీలో డబ్బులు పడితే గాని, దేవాలయం ఆదాయం పెరగదు. అది పెరిగితే గాని ఆలయ సిబ్బందికి ఆర్థిక ఇబ్బందులు తగ్గవు. బహుశా ఇదీ దానికి నేపథ్యం! ఇదీ దాని నెట్‌వర్క్!! విగ్రహాలు పాలు తాగే విషయమై జాతీయ స్థాయిలో ఒక టెలివిజన్ ఛానెల్ అభిప్రాయ సేకరణ చేపడితే “తెలిసిన వాళ్ళెవరైనా శాస్త్రీయ వివరణ ఇస్తే (కేవలం సర్ఫేస్ టెన్షన్ మాత్రమేనని నిరూపిస్తే) నమ్మడానికి తాము సిద్ధంగా వున్నామని” ఎనభై అయిదు శాతం మంది చెప్పారు.

విగ్రహాలు పాలు తాగుతున్నాయన్న వదంతులు దేశాన్ని అప్పుడప్పుడు కుదిపేస్తున్నాయి. అయితే ఇది దేవుని మహిమ వల్ల కాదు, దానికి కారణ మరొకటి వుంది. దేవుని మహిమే అయితే, ఆ దేవుడు తీర్థంతో పాటు ప్రసాదం కూడా స్వీకరించాలి కదా? భక్తులు దేవతా మూర్తులకు పులిహోర, దద్ధోజనం, లడ్డూ, కోవ, పరమాన్నం లాంటివి తినిపిస్తే మనం కూడా ఆ భక్తుల అడుగు జాడల్లోనే నడిచి, వారు చెబుతున్న మహిమల్ని నమ్మొచ్చు. కాని ఆ పని వారు చేయలేదు. ఇక ముందు కూడా చేయలేరు. ఎందుకంటే ద్రవ పదార్థాలు తప్ప, ఘన పదార్థాల్ని విగ్రహాలు పీల్చుకోవు.
దేవుడి మహిమే అయితే విగ్రహాలు చక్కగా నోటి ద్వారానే పాలు తాగాలి. కాని పాల చెంచా విగ్రహానికి ఏ భాగంలో తాకించినా అది పాలు పీల్చుకుంటుంది. దేవుడు గనక, ఆయనకు నోరేమిటీ? అన్ని భాగాల నుండి స్వీకరిస్తాడు అని అంటే అది వితండ వాదం అవుతుంది. అంత మాత్రానికి దేవతా విగ్రహానికి నోరు, ముక్కు, చెవులు, కళ్ళూ వంటి భాగాలెందుకూ? ఒక నిర్దుష్టమైన ఆకారమెందుకూ? ఇక్కడ తెలుసుకోవాల్సింది దేవుడి ధర్మాలు కానే కాదు.

శిలా ధర్మాలు తెలుసుకోవాలి! 1995లో సెప్టెంబర్ 21న దేశంలో తొలిసారి ప్రచారంలోకి వచ్చిన ఈ సంఘటన, అప్పుడప్పుడు పునరావృతమవుతూనే వుంది. విగ్రహాలు పాలు పీల్చుకోవడం, గుళ్ళోనే కాదు, బయట కూడా జరుగుతుంది. దానికి కారణం“సర్ఫేస్ టెన్షన్‌” అనే ఒక శాస్త్రీయమైన ధర్మం! అదేమిటంటే విగ్రహం అంతా మనకు కనిపించని సూక్ష్మరంధ్రాలు వుంటాయి. అందువల్ల అవి పాలు పీల్చుకోవడం సాధ్యమవుతుంది. పీల్చుకున్న పాలు ఎక్కడికి పోతున్నాయీ? దేవుడి విగ్రహం జీర్ణం చేసుకుంటుందా? లేదు. విగ్రహం వెనుక వైపుకు గాని, కింది వైపుకు గాని పాలు కారిపోతున్నాయి. అంటే ఏమిటీ? ఇటు నుంచి పీల్చి, విగ్రహం అటు వదిలేస్తుందన్న మాట! అది కేవలం శిలా ధర్మం మాత్రమే!
ఇటీవల ఒకాయన గోడ మీది కేలండర్‌లోని దేవుని చిత్రానికి పాలు తాగించాడట. కేలండర్ అంటే పేపర్. పేపర్ పాలను పీల్చుకుంటుంది కదా? కేలండర్‌లు గుడ్డతో కూడా తయారవుతుంటాయి. అది గనుక గుడ్డ కేలండర్ అయి వుంటే తప్పకుండా పాలు పీల్చుకుంటుంది.

అలాగే ఇటుకల క్కూడా పాలు తాగించొచ్చు. రోడ్డు మీద పడి వున్న రాయికీ తాగించొచ్చు. అంటే అలా పీల్చుకోవడం వాటి ప్రాథమిక లక్షణం! అదే మనం విగ్రహాలలో చూస్తున్నాం. తప్పితే, విగ్రహాలకు మహిమ వున్నట్టు కాదు. అలా మహిమలు ఉన్నట్టు ప్రకటించడమంటే, అది అజ్ఞానమైనా కావాలి లేదా ప్రజలను మోసగించేందుకు ఉద్దేశ పూర్వకంగా పన్నిన పన్నాగమైనా కావాలి.
“ఏ నిరూపణకూ అందనిదే మహిమ” అని కొందరు భక్తులు నిర్వచిస్తున్నారు. మరి దాన్ని సవాలుగా తీసుకొని శాస్త్రజ్ఞులు కళ్ళకు ఎదురుగా నిరూపణలు జరుపుతూ వుంటే దాని గురించి జనం ఎందుకు ఆలోచించరూ? ఒక శాస్త్రవేత్త హైదరాబాదు, హబ్సిగూడలోని ఒక జాతీయ పరిశోధనా సంస్థ ఎదుట చెప్పులు కుట్టే మోచి పరికరానికి పాలు తాగించి చూపాడు. ఇటుకలు, రాళ్ళు, విగ్రహాలు పాలు పీల్చుకోవడం ప్రకృతి సహజమైన చర్య అని, దేవుడి మహిమ కాదని శాస్త్రజ్ఞులు ప్రత్యక్షంగా టెలివిజన్ కార్యక్రమంలో చూపారు. పాలల్లో రంగు కలిపి తాగిస్తే గనక, ఆ పాలు ఆ విగ్రహంలో ఏఏ భాగాల్లోకి పీల్చుకోబడిందో, మళ్ళీ ఎక్కడి నుండి వదిలివేయబడిందో స్పష్టంగా చూసే అవకాశం కూడా వుంటుంది.

ఆసక్తి వున్న వారు చేసి చూసుకోవచ్చు. ఇది ఇలా వుండగా లోగడ ఒక రోజు ముంబైలోని మహీమ్ బీచ్ వద్ద సముద్రంలోని నీరు తీయగా మారిందని, అందుకు కారణం హాజీ మక్దుమ్ బాబా మహిమేనని.. వేల జనం కలుషితమైన నీరు తాగారు. వర్షం ఎక్కువగా పడ్డప్పుడు మన దొడ్లో చేద బావి నీరు పైకి రావడం సాధారణంగా చూస్తూనే వుంటాం. అదే సూత్రం ఇక్కడ సముద్రపు పాయకు కూడా వర్తిస్తుంది కదా? భూగర్భ జలాలు పైకి రావడం, వాతావరణ మార్పుల వల్ల, కెరటాలు రాకపోవడం వల్ల నీటిలో ఉప్పు శాతం తగ్గి వుంటుంది. అంతేగాని, అది ఎవరి మహిమా కాదు. కాని ఇలాంటివి ‘మాస్ హిస్టీరియా’ కింద మారి, జనం అంధ విశ్వాసాలకు బలి అవుతున్నారు.
ఇప్పటికే అనేక రకాల మూఢ నమ్మకాలతో జీవితాన్ని దుర్భరం చేసుకుంటూ వుండే జనం, ఎల్లప్పుడూ హేతుబ్ధంగా ఆలోచిస్తూ వుంటే, ఒక ఆరోగ్యవంతమైన నూతన ఆదర్శ సమాజం రూపొందుతుంది.

దేశం బాబాలతో, స్వాములతో, మహర్షులతో రోగగ్రస్తమైపోతూ ఉంటే శాస్త్రవేత్తలు, సైన్సు కార్యకర్తలు, విద్యావేత్తలు ఎక్కువ మంది కార్యరంగంలోకి రావాలి. ఓ పెద్ద డిగ్రీ సంపాదించుకొని, ఓ పది పరిశోధనా పత్రాల్ని ప్రచురించుకొని, మూడు సెమినార్లు, ఆరు సింపోజియాలకు హాజరైనంత మాత్రాన అయిపోయిందా? తమకు ఒక విలువను, గౌరవాన్ని ఇచ్చిన సమాజం పట్ల తమ బాధ్యత తీరిపోతుందా? ఓ మహిర్షి “ఆధునిక శాస్త్ర విజ్ఞానమంతా వేదాలలో వుంది” అనంటే అందరూ స్పందించి ఖండించాల్సింది కదా? ఓ మహర్షి “విమానాల తయారీ వేదాలలో వుందని” వక్రంగా చెపితే అట్లా ఊరికే ఎందుకు వదిలేశారూ? ఇటు మతానికి అటు రాజకీయాలకు ముడి పెట్టిన స్వామి జైల్లో పడితే మేధావులు ఎందుకు మాట్లాడలేదూ? ఓ బాబా పడక గదిలో యువకుల హత్యలు జరిగితే అదేదో పవిత్ర కార్యంగా భావించారా? ఇలాంటి విషయాల్లో మార్గదర్శకంగా వుండాల్సిన శాస్త్రజ్ఞుల పాత్రేది? చొరవేదీ? ప్రభుత్వాలే మూఢ నమ్మకాల్లో కొట్టుకుపోతున్నప్పుడు వివేకవంతులైన సామాన్యులు తప్పకుండా ముందుకు రావాలి! తప్పదు.

డా. దేవరాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News