ఒక్క రోజులో 26 మంది మృతి
న్యూఢిల్లీ: గత 24 గంటల్లో భారత్‌లో 9355 కొత్త కొవిడ్ కేసులు చోటుచేసుకున్నాయని, 26 మంది మృతి చెందారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం విడుదలచేసిన డేటా తెలిపింది. కాగా రోజువారీ పాజిటివ్ డేటా 4.08 శాతంగా, వారాంతపు పాజిటివిటీ రేటు 5.36 శాతంగా ఉందని పేర్కొంది. మూడేళ్ల కొవిడ్ మహమ్మారి కాలంలో క్రియాశీలక కేసుల సంఖ్య 57410. ఇప్పటి వరకు ఇండియాలో 44.9 మిలియన్ కేసులు రిపోర్టు కాగా, 531424 మరణాలు సంభవించాయని డేటా పేర్కొంది.
కొవిడ్ క్రియాశీలక కేసులు నేడు కర్నాటకలో 1734, కేరళలో 13773, మహారాష్ట్రలో 5233, గుజరాత్‌లో 1632, ఢిల్లీలో 4708, తమిళనాడులో 3463, హిమాచల్‌ప్రదేశ్‌లో 1172, హర్యానాలో 4394, ఛత్తీస్‌గఢ్‌లో 2857, రాజస్థాన్‌లో 3440, ఉత్తర్‌ప్రదేశ్‌లో 3874 కేసులు రిపోర్టయ్యాయి.
‘ఏప్రిల్‌లో చలి, దగ్గు, ఫ్లూ వంటి లక్షణాలు కొందరిలో కనిపించాయి. అది కొవిడే. పెరుగుతున్న ఉష్ణోగ్రతలో ఇన్‌ఫ్లూయెంజా వైరస్ జీవించలేదు. వృద్ధులు ఈ లక్షణాలతో అడ్మిట్ అయ్యారు. కనుక ఎవరైనా ఇప్పటి వరకు బూస్టర్ డోస్ తీసుకోకుంటే తీసుకోవాలి’ అని ఫోర్టిస్ హాస్పిటల్ పల్మొనరీ డిపార్ట్‌మెంట్ హెడ్ వికాస్ మౌర్య తెలిపారు.
ప్రస్తుతం కేసులు పెరగడానికి కారణం ఎక్స్‌బిబి.1.16 వేరియంట్ కారణమని శాస్త్రజ్ఞులు చెప్పారు. జనసమ్మర్ధ ప్రదేశాలలో మాస్క్‌లు ధరించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. సంక్రమణను నిరోధించేందుకు రిస్క్ అసెస్‌మెంట్ అప్రోచ్‌ను పాటించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను , కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఇప్పటి వరకు దాదాపు 44335977 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.69 శాతాన్ని చేరుకుంది. వ్యాక్సిన్ డ్రైవ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 220.66 కోట్ల వ్యాక్సిన్లను ఇచ్చారు. గత 24 గంటల్లో 4358 వ్యాక్సిన్లను దేశవ్యాప్తంగా ఇచ్చారు.