1500కు పైగా శకటాలు, ట్యాంకులు
కీవ్ : ఉక్రెయిన్‌కు నాటో కూటమి అండగా నిలుస్తూ తాజాగా పలు విధాలైన ఆయుధాల సహాయానికి దిగింది. ఈ దఫా నాటో మిత్రపక్ష కూటమి నుంచి ఉక్రెయిన్‌కు 1500 కు పైగా పోరాట పటిమ వాహనాలు, 230 ట్యాంకులను పంపించారు. రష్యా సేనల నుంచి విరామం లేని రీతిలో సాగుతోన్న దాడులను ఉక్రెయిన్ తన అత్యల్ప ఆయుధ సంపత్తితో ప్రతిఘటిస్తూ వస్తోంది. ఈ క్రమంలో నాటో దేశాలు ఉక్రెయిన్‌కు అండగా నిలిచాయి.
ఇప్పుడు తమ నుంచి ఉక్రెయిన్‌కు 1550 ఆయుధ శకటాలు, ట్యాంకులు పంపించిన విషయాన్ని నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టాల్టెన్‌బెర్గ్ తెలిపారు. ఇప్పటికే నాటో నుంచి అత్యంత అధునాతన ఆయుధాలను పంపించినట్లు వీటి వాడకానికి తగు శిక్షణ ఇప్పించినట్లు వెల్లడించారు. రష్యా ఆక్రమిత ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునే దిశలో ఉక్రెయిన్‌ను అన్ని విధాలుగా బలోపేతం చేస్తామని జెన్స్ తెలిపారు.