న్యూఢిల్లీ: అవయవదానం చేసిన కేంద్ర ఉద్యోగులకు 42 రోజుల ప్రత్యేక సెలవును మంజూరు చేస్తారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు గురువారం ప్రకటించాయి. ఉద్యోగులు ఇతరులకు అవయవదానం చేసినప్పుడు కీలక ఆపరేషన్‌కు గురి కావల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారికి 42 రోజుల క్యాజువల్ లీవ్స్(సిఎల్స్)ను ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ ఇటువంటి విషయాలలో 30 రోజుల సిఎల్స్ ఇస్తూ వస్తున్నారు. దీనిని మరో 12 రోజులు పెంచాలని నిర్ణయించారు. అవయవదాత నుంచి అవయవాల తొలిగింపు ప్రధానమైన ఆపరేషన్ ద్వారానే సాధ్యం అవుతుంది. ఈ క్రమంలో అవయవదానానికి దిగిన వారు తగు విధంగా కోలుకుని ఆరోగ్యవంతులు అయితే సక్రమంగా విధులు నిర్వర్తించేందుకు వీలేర్పడుతుంది. మానవతా రీతిలో అవయవదానానికి దిగిన వారికి తగు విశ్రాంతి అవసరం. కొద్దిరోజులు వారు బయట తిరగడానికి వీల్లేదు.
Also Read: శ్రీరామనవమి హింసాకాండపై ఎన్‌ఐఎ విచారణ
ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుందని, వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని వీరికి ఈ ప్రత్యేక సెలవు దినాలను పెంచినట్లు సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ తమ ప్రకటనలో తెలిపింది. చాలా ఔదార్యంతో కూడుకున్న అవయవదానం వితరణశీలతకు సంబంధించిన విషయం అయినందున ఇందుకు ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించేందుకు ఈ విధంగా సెలవు దినాల పెంపుదల నిర్ణయం తీసుకున్నారని అధికార ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నమోదిత డాక్టర్లు, సంబంధిత విషయాల వైద్య నిపుణుల సలహాలు సిఫార్సుల మేరకు ఈ 42 రోజుల సెలవు నిర్ణయం తీసుకున్నారు. అవయవదానానికి దిగి, సంబంధిత ప్రభుత్వ డాక్టర్ల నుంచి ఆమోదిత పత్రం తీసుకున్న వారికి మానవ అవయవాల మార్పిడి చట్టం 1994 నిబంధనల మేరకు లీవ్స్‌ను పెంచారు. ఆమోదిత ఈ నిర్ణీత సెలవును అవయవదానానికి దిగిన ఉద్యోగి ఏకంగా ఒకేసారి వాడుకోవచ్చు లేదా డాక్టర్ల సూచనల మేరకు వేర్వేరు దశలలో కూడా వాడుకునేందుకు వీలుంటుంది.