Saturday, November 23, 2024

పగలు ధవళ వర్ణం! రాత్రిళ్లు సప్త వర్ణం!

- Advertisement -
- Advertisement -

“రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్‌” అని సినీ కవి చెప్పినట్టుగా భాగ్యనగరి సిగలో మరో మణిహారం చేరింది. ఇటు చూస్తే నింగికి బాహువులు చాపినట్టుగా అంబేడ్కర్ విగ్రహం! ఎదురుగా అఖండ జ్యోతి వెలుగుతున్నట్టుగా తెలంగాణ అమరువీరుల స్మారక చిహ్నం! తలపక్కకి తిప్పితే తథాగథుడి మౌనముద్ర చుట్టూ అపార జలరాశి- హుస్సేన్ సాగర్! మధ్యలో నీటిని వయ్యారంగా ఆకాశానికి ఎగజిమ్మే ఫౌంటెయిన్! దూరంగా జాతీయ జెండా రెపరెపలు! ఆధునిక పాలనా దేవాలయంగా అభివర్ణించే నూతన సచివాలయంతో భాగ్యనగరం కొత్త రూపును సంతరించుకుంది.

తెలంగాణ సచివాలయం! వందేళ్ల విజన్‌తో కట్టిన ఆధునిక పాలనా దేవాలయం! సాగర తీరాన ఠీవీగా నిలబడ్డ సౌథంలో ప్రతీ అణువూ అబ్బురం! ప్రతీ అంతస్తు అద్భుతం! రాజసం ఉట్టిపడే ఈ పరిపాలనా భవనం సకల సౌకర్యాల సమాహారం! అడుగడుగునా ఆధునిక సాంకేతికత మేళవించిన ఈ సచివాలయంలో ఊహకందని సదుపాయాలెన్నో!ఫర్నిచర్ దగ్గర్నుంచి పూలకుండీల వరకు టెక్నాలజీ మొదలుకుని టాయిలెట్ల వరకు అంతా ఇంటర్నేషనల్ స్టాండర్ట్!
దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా చరిత్రలో నిలిచిపోయేటట్టు సచివాలయం ఉండాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ కలల సౌధమే నేటి నూతన సచివాలయం.ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విజన్‌కు ప్రతిరూపం మనడంలో అతిశయోక్తిలేదు. కెసిఆర్ పాలనకు నూతన వేదికగా తెలంగాణ ప్రగతి వీచికగా నిలుస్తుంది. నభూతో నభవిష్యతన్నట్టు ఎక్కడా రాజీపడలేదు! ఏ విషయంలోనూ వెనక్కి తగ్గలేదు! వందేళ్ల విజన్‌తో నిర్మించిన సచివాలయం మయసభనే తలపిస్తోంది. పగలు ధవళవర్ణం! రాత్రిళ్లు సప్తవర్ణం! సచివాలయం ప్రాంగణంలో నీళ్లు చిమ్మే ఫౌంటెయిన్ స్పెషాలిటీ అదే! పచ్చటి తివాచీ పరిచినట్టుగా గ్రీన్ లాన్ కనువిందు చేస్తుంది! గుమ్మటాలు గతకాలపు చారిత్రక నేపథ్యానికి అద్దం పడుతున్నట్టుగా ఉంటాయి. తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబంగా నిర్మించిన సెక్రటేరియట్ ప్రపంచానికే ఆకర్షణగా నిలుస్తుంది.

వాస్తు దోషాలను నివారించి దీర్ఘ చతురస్రాకారంలో 20 ఎకరాల్లో నిర్మించిన ఈ సచివాలయ సముదాయం చరిత్రలో నిలిచిపోయే సౌధంగా ఉందనడంలో సందేహం లేదు. చరిత్రాత్మక నిర్మాణ శైలితో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రభుత్వం ఈ సచివాలయాన్ని నిర్మించింది. భవనంపై మొత్తం 34 గుమ్మటాలు ఏర్పాటు చేశారు. తూర్పు, పశ్చిమ వైపుల్లో భవనం మధ్యలో రెండు అతిపెద్ద గుమ్మటాలు, వాటిపై జాతీయ చిహ్నాలు ఏర్పాటు ప్రత్యేక ఆకర్షణ. 150 ఏళ్లు నిలిచేలా, ప్రకంపనలు తట్టుకునేలా ముఖ్యమంత్రి కెసిఆర్ దగ్గర ఉండి డిజైన్ చేయించారు. నీలకంఠేశ్వరాలయం, వనపర్తి ప్యాలెస్, సారంగాపూర్ హనుమాన్ ఆలయంస్ఫూర్తిగా సచివాలయం నిర్మాణం సాగింది. ఒక్కమాటలో చెప్పాలంటే సచివాలయం మయసభను తలపించేలా ఉందని చెప్పుకోవచ్చు. మీటింగ్ హాల్, డైనింగ్ హాల్ ఇవన్నీ అదిరిపోయేలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా సచివాలయం చుట్టూ గ్రీనరీ మాత్రం అదిరిపోయింది. సచివాలయం ప్రాంగణంలోనే హెలీప్యాడ్ ఉంది.
నూతన సచివాలయంలో తిరుపతి శిల్పాలు కొలువు దీరడం ప్రత్యేకత. గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, అభయాంజనేయస్వామి, సింహ, నంది విగ్రహాలతో పాటు శివలింగం తదితర రాతి శిల్పాలు తయారు చేసి అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం టిటిడిని కోరిందే తడవుగా టిటిడి తిరుపతిలోని ఎస్వీ సాంప్రదాయ ఆలయ నిర్మాణ, శిల్పకళా సంస్థ ద్వారా ఆరు విగ్రహాలు తయారు చేసి అందజేసేంది. సాగర తీరంలో, సచివాలయం ముందున్న లుంబినీ పార్కు, ఉత్తర భాగం లో ఉన్న ఎన్‌టిఆర్ గార్డెన్ ఆ పక్కనే నిర్మాణం అవుతున్న భారీ అంబేడ్కర్ విగ్రహం, లుంబినీ పార్కు పక్కనే నిర్మాణంలో అమరవీరుల స్థూపం, ఇలా అన్నింటి రూపురేఖలను సమూలంగా మార్చేలా హెచ్‌ఎండిఎ కార్యాచరణ రూపొందించింది.

హుస్సేన్‌సాగర్ జలాల్లో నూతన సచివాలయం ప్రతిబింబం స్పష్టంగా కనిపించేలా నిర్మా ణం జరిగింది. అంతేకాకుండా దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా సాగర తీరం కొలువై ఉండాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్షల కనుగుణంగా నూతన సచివాలయం రూపుదిద్దుకుంది. ప్రస్తుతం సచివాలయం చుట్టు ఉన్న ప్రాంతాలను సరికొత్తగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా హెచ్‌ఎండిఎ భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇంద్రభవనాన్ని తలపిస్తున్న బి.ఆర్.అంబేడ్కర్ నూతన సచివాలయ భవనం చూపరులను కట్టిపడేస్తున్నది. సరికొత్త కాంతులతో ఆకట్టుకుంటున్నదనే చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News