Friday, November 22, 2024

రైతులందరికీ పరిహారం అందిస్తాం..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ, జనగామ : అకాలవర్షాలతో పంటలు నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందిస్తామని, కౌలు రైతులకు అన్యాయం జరగనివ్వమని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం జనగామ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ శివలింగయ్య, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, సంబంధితశాఖల అధికారులతో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అకాల వర్షాలు, పంటనష్టం, ధాన్యం కొనుగోలు వంటి అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వమే ఆఖరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేపడుతుందని, మక్కలను కూడా కొనుగోలు చేస్తుందని తెలిపారు. జిల్లాలో పంట నష్టపోయిన ప్రతి రైతుకు, కౌలు రైతులకు సైతం సమానంగా పంట నష్టపరిహారం అందిస్తామని తెలిపారు.

గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న విద్యుత్‌స్తంభాలను గుర్తించి కొత్తవి వేయాలని, వ్యవసాయ, రెవెన్యూశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్‌మిళ్లులకు తరలించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య మాట్లాడుతూ.. జిల్లాలో వడగళ్లవానకు 44166 ఎకరాల్లో వరి, 3297 ఎకరాల్లో మామిడి, 430 ఎకరాల్లో మొక్కజొన్న, 93 ఎకరాల్లో కూరగాయలు, పశువుల ప్రాణనష్టం, 19 గృహాలు కూలిపోవడం జరిగినట్లు తెలిపారు. ప్రత్యేక బృందాలతో సర్వే చేయించి పంటనష్టాన్ని అంచనా వేసినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసుకుంటున్నట్లు తెలిపారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వడగళ్ల వాన వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందేలా కృషిచేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News