పాట్నా: కీలకమైన కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రతిపక్ష నేతల సమావేశం పాట్నాలో జరగవచ్చని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శనివారం సూచన ప్రాయంగా తెలియజేశారు. ప్రతిపక్షాల మధ్య ఐక్యతను సాధించడానికి సంబంధించిన అంశాలను ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించడం జరుగుతుందని కూడా ఆయన చెప్పారు.‘ 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాల కూటమిని ఏర్పాటు చేసే అంశాన్ని మేమంతా కలిసి కూర్చుని చర్చించుకుంటాం. ప్రస్తుతం చాలా మంది నేతలు కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ ఎన్నికలు ముగిశాక మా సమావేశం వేదికను ఖరారు చేస్తాం. ప్రతిపక్షాల నేతల సమావేశానికి వేదికగా పాట్నాను ఏకగ్రీవంగా నిర్ణయిస్తే అక్కడే ఆ సమావేశం జరుగుతుంది’ అని నితీశ్‌కుమార్ చెప్పారు. పాట్నాలోఈ సమావేశాన్ని నిర్వహించడం మాకు ఎంతో సంతోషం అని కూడా ఆయన చెప్పారు.
ఈ నెల 24న కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జెడి(యు) అధినేత నితీశ్ కుమార్, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌తో సమావేశమైన తర్వాత రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల ఐక్యతపై చర్చించేందుకు పాట్నాలో అన్ని బిజెపియేతర పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నితీశ్‌ను కోరిన విషయం తెలిసిందే. జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమం బీహార్‌నుంచే ప్రారంభమైందని మమత అంటూ బీహార్‌లో అన్ని ప్రతిపక్షాల సమావేశం జరిగితే తదుపరి ఏం చేయాలనేది అక్కడ నిర్ణయించగలుగుతామని అన్నారు. నితీశ్ కుమార్ కూడా మమత సూచనను సానుకూలంగా స్పందించారు. మమతతో సమావేశమైన తర్వాత నితీశ్, తేజస్విలు అదే రోజు లక్నోలో సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో కూడా సమావేశమై ప్రతిపక్ష పార్టీల కూటమి ఏర్పాటుపై చర్చించారు. ఈ సమావేశాలకు ముందు నితీశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో కూడా భేటీ అయ్యారు.