ముంబయి: మే నెలలో జరిగే కింగ్ చార్లెస్ పట్టాభిషేకం సందర్భంగా నిర్వహించే పట్టాభిషేక కచేరి కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నటీనటులు లియొనెల్ రిచీ, కాటీ పెర్రీలాంటి వారితో బాలీవుడ్‌నటి సోనమ్ కపూర్ కూడా వేదికను పంచుకోనున్నారు. మే 6న లండన్‌లోని వెస్ మినిస్టర్ అబేలో 74 ఏళ్ల కింగ్ చార్లెస్3 రాణి కమిల్లాతో కలిసి అధికారికంగా బ్రిటీష్ రాజుగా పట్టాభిషిక్తుడవుతున్న విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు ఈ పట్టాభిషేక వేడుకలు జరగనున్నాయి. మే 7న విండ్సర్ క్యాసిల్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనడానికి సోనమ్ కపూర్‌ను ఆహ్వానించినట్లు ఓ పత్రికా ప్రకటన తెలిపింది.
బిబిసి, బిబిసి స్టూడియో రూపొందించి ప్రదర్శించనున్న ఈ కార్యక్రమాన్ని ఆ సంస్థలు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సంగీత విద్వాంసులు, సమకాలీన తారలు పాల్గొంటున్నారు. భారత్‌నుంచి సోనమ్ కపూర్‌కు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటుండడం గమనార్హం. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం తనకు ఆహ్వానం రావడం గర్వంగా ఉందని సోనమ్ కపూర్ ఓ ప్రకటనలో తెలిపారు.