Monday, December 23, 2024

అంబేద్కర్ సాక్షిగా.. జాతిమెచ్చే సుపరిపాలన

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : అనేక త్యాగాలతో, శాంతియుత పార్లమెంటరీ పంథాతో సాధించుకున్న రాష్ట్రం అనతి కాలంలో దేశానికే ఆదర్శవంతంగా విరాజిల్లుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రతిష్ట మహోన్నతంగా వెలిగేలా, ప్రజల ఆత్మగౌరవం మరింత ఇనుమడింపచేసేలా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, వినూత్న రీతిలో అద్భుతంగా తెలంగాణ సచివాలయాన్ని నిర్మించుకున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఇది యావత్ తెలంగాణ సమాజం గర్వించదగ్గ గొప్ప సందర్భమని సిఎం పేర్కొన్నారు. డా. బిఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనేక అపోహలు సృష్టించి చేసిన విమర్శలు అడ్డంకులను దాటుకుంటూ ధృఢ సంకల్పంతో ప్రారంభమైన నూతన సచివాలయ నిర్మాణం, అనతి కాలంలోనే దేశానికే వన్నె తెచ్చేలా పూర్తై, ప్రజలకు అందుబాటులోకి రావడంపై సిఎం హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాల పరిపాలన అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యంత గొప్పవైన సాంకేతిక విలువలతో కూడిన నిర్మాణంతో సెక్రటేరియట్ నిర్మాణం జరిగిందన్నారు.

అంబేద్కర్ పేరు మొదటిసారి
అన్నిరకాల ప్రమాణాలను పాటిస్తూ, అనేక విశిష్టతలను సొంతం చేసుకుంటూ, దేశంలోనే మొట్టమొదటి పర్యావరణ అనుకూల మహాద్భుత కట్టడమని సిఎం పేర్కొన్నారు. ప్రశాంతతను ప్రసాదించే దేవాలయం మాదిరి, చూస్తేనే కడుపు నిండే విధంగా అత్యంత ఆహ్లాదభరితమైన వాతావరణంలో ఉద్యోగులు పనిచేసేలా నిర్మితమైన ఈ సచివాలయం, ప్రభుత్వయంత్రాంగ పనితీరును గొప్పగా ప్రభావితం చేస్తూ గుణాత్మక మార్పుకు బాటలు వేయనుందన్నారు. మార్పుకను గుణంగా ఎప్పటికప్పుడు తమను తాము తీర్చిదిద్దుకుంటూ, ప్రజా ఆకాంక్షలకు అనుకూలంగా మహోన్నత లక్ష్యాలను నిర్దేశించుకుంటూ, వాటిని సాకారం చేసే దిశగా సుపరిపాలన కొనసాగేలా సెక్రటేరియట్ నిర్మాణం జరిగిందని సిఎం అన్నారు. రాష్ట్ర సచివాలయానికి డా బిఆర్ అంబేద్కర్ పేరును పెట్టడం దేశంలోనే మొదటిసారి అని సిఎం తెలిపారు.

సకల జనుల సంక్షేమ పాలనను దేశానికి ఆదర్శంగా

అంబేద్కర్ పేరు పెట్టుకోవడం వెనక సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక రంగాల్లో ఎస్సీ, ఎస్టీ, బిసి మైనారిటీ మహిళా, పేద వర్గాలకు సమాన హక్కులు దక్కాలన్న సమున్నత లక్ష్యముందని సిఎం అన్నారు. సచివాలయం ఎదురుగా తెలంగాణ అమరుల స్మారక జ్యోతి, పక్కనే ఆకాశమంత ఎత్తున అంబేద్కర్ మహనీయుడి విగ్రహం రేపటికి దిక్సూచిగా నిలిచి నిరంతరం ఒక స్పూర్తిని రగిలిస్తుందన్నారు. తెలంగాణ పాలన సౌధం నుంచి జాతి మెచ్చే సుపరిపాలన రాష్ట్ర ప్రజలకు అందాలన్న మహోన్నత లక్ష్యంతో, తాత్వికత సైద్దాంతిక అవగాహనతో అంబేద్కర్ మహనీయుడి పేరును తెలంగాణ సచివాలయానికి పెట్టడం జరిగిందన్నారు. దేశంలో అత్యంత చిన్న వయసున్న రాష్ట్రంగా, ఇతర రాష్ట్రాలతో పోల్చితే, తెలంగాణ సకల జనుల సంక్షేమ పాలనను దేశానికి ఆదర్శంగా అందిస్తుందని సిఎం పేర్కొన్నారు.

ఈ కట్టడం వెనుకున్న అందరికీ అభినందనలు

అనతికాలంలోనే దేశానికే తెలంగాణ పాలన ఒక మోడల్‌గా నిలిచిందని, ఇది దేశవ్యాప్తంగా విస్తరించేలా తెలంగాణ పాలన నూతన సచివాలయం నుంచి ద్విగుణీకృతమవుతుందని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభ దేదీప్యమాన మయ్యేలా, దార్శనికతతో సాధించిన ప్రగతి వెలుగుల దారిలో, ప్రస్థానం మహోన్నతంగా కొనసాగుతుందని సిఎం కెసిఆర్ తన ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్‌ను అత్యంత గొప్పగా తీర్చిదిద్దడంలో అమోఘమైన పాత్ర పోషించిన, రాల్లెత్తిన కూలీలను, మేస్త్రీలను, నిర్మాణంలో కష్టించి పనిచేసిన అన్ని వృత్తుల నిపుణులను, అపురూపంగా మోడల్ అందించిన ఆర్కిటెక్టులను, విరామమెరుగక రేయింబవళ్లు పనిచేసిన కాంట్రాక్టు ఏజెన్సీలను, ఇంజనీర్లను, ఆర్ అండ్ బి శాఖ మంత్రిని, ఉన్నతాధికారులను, ఇంజనీర్లను, సిబ్బందిని, నిర్మాణంలో పాల్గొన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రతి ఒక్కరినీ పేరు పేరునా సిఎం కెసిఆర్ ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News