ఫ్లోరిడా : అమెరికాలో మరో సారి టోర్నడో విలయం సంభవించింది. ఫ్లోరిడాలో ఉన్నట్లుండి చెలరేగిన కేంద్రీకృత సుడిగాలి తీవ్రతతో పెను విధ్వంసం చోటుచేసుకుంది. గాలి ఉధృతితో పలు కార్లు కొట్టుకుపోవడం , కొద్ది సేపు గాలిలోనే చక్కర్లు కొట్టడం, పల్టీలు కొడుతూ ఒకవాహనంపై మరోటి చేరడం వంటి భీభత్సాలు జరిగాయి. కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. ఒక చోట ఓ షెడ్ పై కప్పు చాలా దూరం వరకూ ఎగిరిపోయింది. టోర్నడో ధాటికి ఓ చోట ఓ వాహనం పైకి ఎగిరి గాలిపటం మాదిరిగా గుండ్రంగా తిరిగింది. సంబంధిత వీడియో దృశ్యాలు ఇప్పుడు టీవీలలో ప్రసారం అయ్యాయి.
Also Read: మాస్టర్‌కార్డ్, ఎం1ఎక్సేంజ్ మధ్య డీల్
టోర్నడో ధాటికి కొన్ని వాహనాలు దెబ్బతిని వాటి భాగాలు చాలా దూరం వరకూ కొట్టుకుపొయ్యాయి. ఈ ఘటనల్లో ఎవరికి ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఫ్లోరిడాలోని నార్త్ పామ్ బీచ్‌లో టోర్నడో తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక్కడి సంపన్నుల ఇళ్లపైకి చెట్లు ఒరిగిపడటం, కొన్ని చోట్ల భవనాలు కన్పించని రీతిలో కూలిన చెట్లు వాటిని కప్పివేస్తున్న రీతిలో ఉండటం వంటి దృశ్యాలు చోటుచేసుకున్నాయి. గల్ఫ్ ఆఫ్ మెక్సికో నుంచి వీస్తున్న భీకర గాలుల ప్రభావం టెక్సాస్ మీదుగా పలు ప్రాంతాల్లో ప్రభావం చూపుతాయని అమెరికా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది రెండురోజుల పాటు తీవ్రతను కల్పిస్తుందని తెలిపారు.