రైళ్ల రాకపోకలను వేగవంతం చేయడానికి అధికారులు కృషి చేయాలి
హైదరాబాద్: అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలను నిర్వహించాలని, రైళ్ల రాకపోకలను మరింత వేగవంతం చేయడానికి, సాధ్యమైన చోట వీలైనంత వరకు హెచ్చరిక సూచికలను తొలగించాలని దక్షిణమధ్య రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్ అధికారులను ఆదేశించారు. రైళ్ల కార్యకలాపాలు, భద్రతపై జోన్ పరిధిలోని అన్ని డివిజన్‌లకు చెందిన ప్రిన్సిపల్ హెడ్స్ ఆఫ్ డిపార్ట్‌మెంట్‌లతో కలిసి జిఎం అధికారులతో సమీక్షా సమావేశాన్ని సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిఎం నిర్వహించారు.
ఈ సమావేశంలో మొత్తం ఆరు డివిజన్లు విజయవాడ, గుంతకల్, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లకు చెందిన ఆయా డివిజనల్ రైల్వే మేనేజర్లు (డిఆర్‌ఎంలు) పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ సరుకు రవాణా రైళ్ల పర్యవేక్షణను పెంపొందించడం, భద్రతా అవసరాలను తప్పకుండా పాటించేలా తరచుగా క్షేత్ర తనిఖీలను నిర్వహించడంపై ప్రధానంగా దృష్టి సారించాలని అధికారులకు ఆయన సూచించారు. రైళ్ల కార్యకలాపాల సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి జోన్ అంతటా కొనసాగుతున్న భద్రత సంబంధిత పనులు, నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు, ట్రాఫిక్ బ్లాక్‌లు, పవర్ బ్లాక్‌ల పటిష్ట స్థితిపై జిఎం సమగ్ర సమీక్ష నిర్వహించారు. రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.